
ఇంట్లో ఏ కంపెనీ మిక్సర్ వాడతారు? అనడిగితే.. ఒక్కొక్కరు ఒక్కో కంపెనీ పేరు చెప్తుంటారు. కానీ.. జ్యూస్ సెంటర్లు నడిపేవాళ్లను అడిగితే మాత్రం చాలామంది సుజాత జ్యూసర్–మిక్సర్ వాడతాం అంటారు. కమర్షియల్ మార్కెట్‌లో సుజాత బ్రాండ్‌కు అంత క్రేజ్ ఉంది మరి. అంతేకాదు.. కొన్ని రాష్ట్రాల్లో సేల్స్‌లో ఈ కంపెనీది మొదటి స్థానం.
ఇండియాలో ఇంజనీరింగ్ టెక్నాలజీ పెద్దగా లేని రోజులవి. ఆ టైంలో క్వాలిటీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్‌ని తీసుకురావాలనే ఉద్దేశంతో సుజాత కంపెనీ మొదలైంది. ఈ కంపెనీని 1979లో బ్రిజ్‌మోహన్ మిట్టల్ మరో నలుగురు ఫ్రెండ్స్‌తో కలసి పెట్టారు. అయితే.. కంపెనీ మొదలుపెట్టే నాటికి ఒక జపనీస్ బ్రాండ్ జ్యూసర్–మిక్సర్ సేల్స్ ఇండియాలో ఎక్కువగా ఉండేవి. వినియోగదారుల్లో ఆ బ్రాండ్‌పై అంత నమ్మకం ఉండేది.
అందుకే అలాంటి మిక్సర్‌నే తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. తర్వాత ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టారు. కానీ.. ఇండియన్ కిచెన్‌కు ఆ జపాన్ టెక్నాలజీ సరిపోదని గ్రహించారు. దాంతో.. 1980లో ఇండియన్ టెక్నాలజీతో జ్యూసర్–మిక్సర్–గ్రైండర్‌ని తయారుచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తక్కువ టైంలోనే చాలా కష్టతరమైన ప్రధాన భాగాలను తయారుచేశారు. కొన్నాళ్లకు పూర్తి ఇండియన్ సుజాత జ్యూసర్–మిక్సర్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.
మొదటి ప్రొడక్ట్ రిలీజ్ అయ్యి నలభై ఏండ్లు దాటింది. ఆ తర్వాత ఎన్నో ప్రొడక్ట్స్ రిలీజ్ అయ్యాయి. అన్నీ సక్సెస్ అయ్యాయి. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. అంతేకాదు.. పనితీరులో, మన్నికలో నెంబర్ వన్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. కాలానికి అనుగుణంగా ప్రొడక్ట్‌లో మార్పులు తీసుకొస్తూ.. డెవలప్ చేశారు. ఇప్పుడు మన దేశంతో పాటు మరో 18 దేశాల్లో సుజాత మిక్సర్ గ్రైండర్లు అమ్ముడవుతున్నాయి.
ఇంపోర్ట్స్‌తో పోటీ
సుజాత కంపెనీ పెట్టిన కొత్తలో విదేశాల నుంచి అనేక కంపెనీల మిక్సర్–గ్రైండర్లు దిగుమతి అయ్యేవి. కానీ.. సుజాత కంపెనీకి అప్పటికి పెద్దగా బ్రాండ్ నేమ్ లేదు. పైగా స్వదేశీ టెక్నాలజీతో బిల్డ్ చేసిన ప్రొడక్ట్ కావడంతో మొదట్లో ఖర్చులు ఎక్కువ అయ్యేవి. లాభాలు తక్కువ వచ్చేవి. జనాలు ఎక్కువగా విదేశీ ప్రొడక్ట్స్‌నే కొనేవాళ్లు. కానీ.. ఎప్పటికప్పుడు విడి భాగాల క్వాలిటీ పెంచుతూ, సేల్స్ పెంచుతూ.. మార్కెట్‌లో నిలబడ్డారు వీళ్లు. అంతేకాదు.. ‘వినియోగదారుడే దేవుడు’ అనే సిద్ధాంతంతో పని చేసి ప్రజలకు నమ్మకం కలిగేలా చేశారు. కంపెనీకి పెద్దగా నష్టాలు రాకపోవడానికి మరో కారణం.. వీళ్లు ఎప్పుడూ అడ్వాన్స్ పేమెంట్ పద్ధతిలోనే ప్రొడక్ట్స్ డెలివరీ చేసేవాళ్లు. అన్ని కంపెనీలు క్రెడిట్ విధానంలో అమ్మినా వీళ్లు మాత్రం అలా అమ్మేవాళ్లు కాదు. అందుకే మొదట్లో మార్కెట్‌లో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ.. తర్వాత ప్రొడక్ట్ క్వాలిటీ చూశాక అడ్వాన్స్ ఇచ్చి మరీ కొనడం మొదలైంది.
డిమాండ్ పెరుగుతూనే ఉంది
జ్యూసర్లు–మిక్సర్–గ్రైండర్లు ఇచ్చిన సక్సెస్‌తో చాలా తక్కువ టైంలోనే వాషింగ్ మెషిన్లు, వాటర్ హీటర్లు, ఎయిర్ కూలర్లు, టోస్టర్లు, ఫ్యాన్లు లాంటివి కూడా సుజాత బ్రాండ్ నుంచి వచ్చాయి. కానీ.. ఈ వస్తువుల ఉత్పత్తిని పెద్దగా పెంచలేకపోయారు. కానీ.. జ్యూసర్–మిక్సర్లకు మాత్రం ప్రతి సంవత్సరం డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఎన్ని మల్టీ నేషనల్ కంపెనీలు పోటీ ఇచ్చినా.. కమర్షియల్ మార్కెట్‌లో సుజాత సేల్స్ తగ్గడం లేదు. అందుకే 2016లో మాన్యుఫాక్చరింగ్ పెంచేందుకు హర్యానాలోని సోనిపట్‌లో మూడు ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు, ఆర్వో సిస్టమ్, కుక్ టాప్స్, వాటర్ హీటర్లు, ఎయిర్ కూలర్ల ప్రొడక్షన్‌ని పెంచడానికి సుమారు 50 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఫ్యాన్లు తయారు చేయడానికి లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేశారు.
సేల్స్ టీమ్
కంపెనీ 2015 వరకు డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే సేల్స్ చేసేది. ఆ తర్వాత ప్రత్యేకంగా సేల్స్ టీమ్‌ని ఏర్పాటు చేశారు. అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెంచారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా డీలర్లు ఉన్నారు. మరింత ఎక్స్‌ప్యాండ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా హర్యానా, రాజస్తాన్, కేరళల్లో ఎక్కువగా అమ్ముడవుతున్న బ్రాండ్ ఇది. ఢిల్లీ, పంజాబ్‌లో సేల్స్‌లో రెండో స్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా18కి పైగా దేశాల్లో సుజాత మిక్సర్లు అమ్ముడవుతున్నాయి.