- ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్ హాజరు
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్పేర్ స్కూల్ లో జిల్లాస్థాయి ఇన్స్పైర్ మనక్ –2024ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్‌మనక్ నిర్వహిస్తోందన్నారు. జిల్లాకు ఎంపికైన 76 ఎగ్జిబిట్స్ కు గాను ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకం కింద రూ.10వేల చొప్పున ఆర్థిక సహకారాన్ని అందిస్తారని తెలిపారు. వీరిలో నుంచి ఆరుగురు విద్యార్థుల ను సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారని చెప్పారు.
కేంద్రంలో ఎంపికైన విద్యార్థులకు ప్రాజెక్టుల అభివృద్ధి పరచుకునేందుకు రూ. లక్ష కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అనంతరం స్కూల్ ప్రాంగణం లో సాయంత్రం ఏర్పాటు చేసిన గ్రాండ్ క్యాంపు ఫైర్ కార్యక్రమానికి భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ హాజరయ్యారు. పోగ్రామ్‌ను ఎమ్మెల్యే తో కలిసి ప్రారంభించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి ఆదివాసీ నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వరచారి, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, డీఎస్ వో చలపతి రాజు, బురాన్ పాల్గొన్నారు.