ధర్నా నేర్పింది గాంధీనే

 దేశ ప్రజల ఆలోచన స్థితిని, వారి చైతన్యాన్ని గుర్తించి వారిని ఉద్యమంలోకి ఎట్లా రప్పించాలో గాంధీకి తెల్సినంత మరెవరికీ తెలియదు కావొచ్చు. అందుకే ఆయన నాటి భారత సమాజాన్ని కదలించేందుకు  చాలా చిన్న చిన్న విషయాలనే ఎంచుకున్నారు. బాగాడంబరం లేదు.  గాంధీ చెప్తారు. దేశం ఆచరిస్తుంది. అంతే. బ్రిటిషు  వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బ్రిటిషు వారిచేతనే భేష్ అన్పించుకున్నారు. అదే గాంధీ ప్రత్యేకత. అశేషమైన ప్రజల మద్దతు ఉండటమే ఆయన ప్రత్యేకత.

అంతేకాదు ప్రజల నిత్య జీవితంపై ప్రభావం చూపించే ఉప్పును ఉద్యమానికి ఆయుధం చేసుకున్నాడు. నిత్యావసరాలను, అత్యంత ప్రభావం చూపే అంశాలే ఆయన ఉద్యమ ఇతి వృత్తాలు. అందుకే  దండి ఉప్పు సత్యాగ్రహం యావత్ దేశాన్ని కదలించింది. ఉప్పు తయారీ వొద్దన్నారు. ఉప్పు  ఉంటే చాలు,  కూరలు లేకున్నా పూట గడుస్తుంది. దీన్ని పట్టుకున్నారు గాంధీ. అందుకే అంతకు ముందు  ఎంతో మంది స్వతంత్ర ఉద్యమాన్ని నడిపినా గాంధీకి ముందు గాంధీ తర్వాత అనే విభజన రేఖ  వచ్చింది. అంతలా ఉద్యమాలను, ప్రజలను, పాలకులను ప్రభావితం చేశారు గాంధీ. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు  ఉప్పు అయితే….నేటి ఆధునిక సమాజంలో యాప్ లు  ఉద్యమాలను తయారు చేస్తున్నాయి.  బడా కంపెనీలను వణికిస్తున్నాయి.  నాణ్యతలేని కంపెనీల, మోసం చేసే కంపెనీల యాప్​లు డిలీట్ చేస్తే సరి. అంటే ఇక్కడ యాప్ లు, ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో నిత్యవసరాలు. ఇలాంటి దాన్ని అప్పుడే గాంధీ ఉపయోగించారు. ఆధునిక ఉద్యమ పోకడలకు పునాది వేశారు.

అంత దూరం ఎందుకు… మన దగ్గర జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాంతం గాంధేయ మార్గంలోనే నడిచింది. ఈ విషయాన్ని జేఏసీ పదేపదే ప్రకటించింది. గాంధీ పేరు ఎత్తుకున్న తర్వాత ప్రభుత్వాలు ఏమీ చేయలేక పోయాయి. పైగా ప్రజలు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చి ఉద్యమించారు. ఇది మన కళ్ల ముందు జరిగిన చరిత్ర. ఈ ఉద్యమం  విజయం  సాధించింది. 1952 కానీ, 1969 ఉద్యమాల్లో గాంధీ సిద్దాంత ప్రస్తావన లేదు. అందు వల్ల  నాటి ప్రభుత్వాలు వాటిని అణిచివేయగలిగాయి. ఈ సారి ఉద్యమంలో గాంధీ ముందు వరుసలో ఉన్నారు. గాంధీ సిద్దాంత ఆధార ఉద్యమమని ఆచరణ ద్వారా  ఉద్యమ నాయకత్వం చూపించింది. అందు వల్ల తెలంగాణకు పోరాటాలే తప్ప విజయాలు లేవు అనే  వేదనను తొలగించిందీ గాంధీ మార్గమే.

నాడు బ్రిటిషు ప్రభుత్వంపై యుద్దం చేయడానికి ఆయన అహింసను ఆయుధంగా చేసుకున్నాడు. దూకుడు కాదు దూసుకు పోయాడు. గోచీ పెట్టుకున్న ఈ పెద్దాయనతో తమకు పేచీ లేదని బ్రిటిషు పాలకులు భావించారు.  భావించేలా చేశారు గాంధీ. కానీ ఆయనే తన శాంతి యుత పద్దతులు. ఆచరణనీయమైన ఉద్యమ మార్గాల ద్వారా ఆయనను ముట్టుకోవాలంటే  కూడా నాటి పాలకులు భయపడ్డారు. ఆయన హింస చేయడం లేదు…. అందరి లాగే  స్వాతంత్ర్యం కోరుతున్నారు. కానీ నాటి అందరి నాయకులంటే తిరుగులేని నేత అయ్యారు. ఇంకా చెప్పాలంటే స్వతంత్ర ఉద్యమం 1920ల తర్వాతనే  ప్రారంభం అయింది. చాలా ప్రభావవంతంగా గాంధీజీ దూసుకొచ్చారు. ఏ యేఅంశాలను తీసుకుంటే ప్రజలు కదులుతారు. ప్రజలను ఎట్లా ఉద్యమంలోకి రప్పించాలి. ఎట్లా ప్రజలను తమ సమస్యల పట్ల మోటివేట్ చేయాలనే విషయాలను సూటిగా, భక్తి మార్గంలో, నైతిక మార్గంలో బోధించారు. ఆవే ఆయనను నిలబెట్టాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పరిసరాలు పరిశుభ్రత గురించి మాట్లాడుతున్నారు. 70ఏళ్ల కింద గాంధీజీ చెప్పిన స్వచ్చత గురించి…. ప్రకృతి ప్రేమ గురించి ఐక్యరాజ్యసమితి  కూడా ఇప్పుడు చెప్తున్నది. మహాత్ముడు ఈ విషయాల గురించి ఏనాడో  చెప్పారు. నాడు గాంధీజీ చెప్పిన చాలా విషయాలు నేటి ఉద్యమాలకు, ప్రభుత్వాలకు,దేశాలకు ఎజెండాలవుతున్నాయి. అందుకే గాంధీజీ ఈ దేశానికి జెండా అయితే ఈయన ఆచరణ భాతర దేశానికి అజెండా  అవుతున్నది.

గాంధీజీయే నా మార్గం: అన్నా

కొన్నాళ్ల కింద అన్నా హజారే అనే పెద్దాయన యావత్ దేశాన్ని కదలించారు. గాంధీ తర్వాత అవినీతి గురించి, రాజకీయాల్లో మార్పు వంటి అంశాలు  జాతీయ అజెండా అయ్యాయి. రాలేగాం సిద్దీలో ఉండే  హజారే యావత్ దేశాన్ని కదలించాడు. ముఖ్యంగా  ఈ తరం అంతా జాతీయ జెండాలతో ఆయన వెనుకే నిలబడింది. లాఠీ దెబ్బలు లేవు. హింసలు లేవు. ఆయన జాతీయ జెండా చేత పట్టారు. గాంధీ టోపీ పెట్టారు. ‘గాంధీనే నా మార్గం’ అన్నారు. యావత్ దేశాన్ని తన వెంట నడిపిం చుకున్నారు. ఈ తరం నెత్తుల మీద గాంధీ టోపీలు పెట్టుకోవడానికి నాటి గాంధీ ఆలోచన, ఆచరణ తప్ప మరోటి కాదు.  అంటే ఉద్యమా లు చేసే వారికి  తరతమ బేధాలు లేకుండా ఉద్యమంలోకి వచ్చే స్పూర్తికి గాంధీనే పునాది.

కేజ్రీకీ ఆయనే స్పూర్తి

కేజ్రీవాల్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి  అయ్యారు. ఈయనకూ స్పూర్తి గాంధీనే. ఆయన చేసిన ఆందోళనలు, ధర్నాలన్నీ గాంధేయ  మార్గంలోనే సాగాయి. ఎక్కడ హర్తాళ్ చేసినా గాంధీనే స్పూర్తిగా తీసుకున్నారు. కేజ్రీవాల్ వెంట  ఢిల్లీ నడిచింది. కానీ వారిని  నడిపించింది గాంధీనే. ప్రశాంత ఉద్యమం… శాంతియుత నిరసన…. ఇవే ఢిల్లీని, నాటి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించాయంటే గాంధీ సిద్దాంతం ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు. 15 ఏళ్ల పాటు పాతుకు పోయిన కాంగ్రెస్​  ప్రభుత్వాన్ని ‘ఆమ్​ ఆద్మీ’ ఓడించగలిగాడంటే గాంధీ చూపిన సత్యగ్రహ మార్గమే కారణం. ఈ తరానికి ఆధునిక రాజకీయ పునాది వేయడానికి కారణం కూడా గాంధీనే.