
సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు ఇటీవల పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో కొన్ని కామెంట్లు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఇలాంటి వాటిని తమ ప్లాట్‌ఫామ్‌పై అడ్డుకునేందుకు ఫేస్బుక్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా తమ సంస్థకు చెందిన ఫొటో షేరింగ్ యాప్ ‘ఇన్స్టాగ్రామ్’లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతున్నట్లు ‘ఫేస్బుక్’ తెలిపింది. ‘షాడో బ్యాన్’ లేదా ‘రెస్ట్రిక్ట్’ పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా ఒక పోస్ట్‌కు వచ్చే కామెంట్లలో అభ్యంతరకరంగా ఉన్న వాటిని బ్యాన్ చేయొచ్చు. అవి కామెంట్లు చేసిన వాళ్లకు మాత్రమే కనబడుతాయి. ఇతరులకు ఈ కామెంట్లు కనబడకుండా ఉంటాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అభ్యంతరకర కామెంట్ల నుంచి యూజర్లు తప్పించుకోవచ్చు.