ప్లేస్టోర్ నుంచి 250 యాప్స్ ఔట్

ప్లేస్టోర్ నుంచి 250 యాప్స్ ఔట్

యాక్షన్​ తీసుకున్న గూగుల్​

న్యూఢిల్లీ: ఇన్‌‌స్టాంట్ లెండింగ్ యాప్స్‌‌పై గూగుల్ కొరడా ఝుళిపిస్తోంది. యూజర్ సేఫ్టీ పాలసీలను అతిక్రమించినందుకు ఇండియాలో 200 నుంచి 250 పర్సనల్ లోన్ యాప్స్‌‌ను గూగుల్ తొలగించింది.  యూజర్లు, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పర్సనల్ యాప్స్‌‌ను రివ్యూ చేసినట్టు తెలిపింది. ఈ యాప్స్‌‌ను దేశంలో 96 శాతం మంది స్మార్ట్‌‌ఫోన్ యూజర్లు వాడుతున్నారు. ఈ యాప్‌‌ల లెండర్లు పర్సనల్ లోన్ల బాకీలను రికవరీ  చేసే విషయంలో యూజర్లతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ యాప్స్ విధానాలతో లోన్లు తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అత్యధిక వడ్డీలు, నెలవారీ వాయిదాల చెల్లింపుల విషయంలో యాప్స్ పెట్టే తిప్పల్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఒత్తిడికి తట్టుకోలేక  కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కరోనా మహమ్మారితో చాలా మందికి జాబ్స్ పోయాయి. జీతాలు తగ్గిపోయాయి. ఈ సమయంలో అప్పులు చెల్లించలేక, యాప్స్ వారి వేధింపులు భరించలేక సతమతమయ్యారు.

ఇండియాలో చట్టాలకు, రెగ్యులేషన్స్‌‌కు కట్టుబడి ఉన్నట్టు  లెండింగ్ యాప్స్ నిరూపించుకోవాలని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌‌లో పేర్కొంది. ఒకవేళ అలా నిరూపించుకోలేని పక్షంలో తదుపరి ఎలాంటి నోటీసు లేకుండా యాప్స్‌‌ను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. వీటి విచారణకు లా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని గూగుల్ స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా 500 నుంచి 600 మొబైల్ లోన్ యాప్స్‌‌కు గూగుల్ నుంచి నోటీసులు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవేళ తమ క్రెడెన్షియల్స్‌‌ను డెవలపర్లు ఐదు పని దినాల్లో గూగుల్‌‌కు అందించలేకపోతే.. ఆ యాప్స్‌‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగిస్తుంది. ఆర్‌‌‌‌బీఐ విధానాలను కూడా ఈ లోన్ యాప్స్ ఉల్లంఘిస్తున్నట్టు సెంట్రల్ బ్యాంక్ చెప్పింది. ఈ యాప్స్ షార్ట్ టర్మ్ లోన్లకు అత్యధికంగా 100–365 శాతం రేట్లను వార్షికంగా విధిస్తున్నాయని, ప్రైవేట్ ఇన్‌‌ఫర్మేషన్‌‌ను ఎక్కువగా లాగుతున్నాయని చెప్పింది.

60 రోజులకి లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత మాత్రమే కస్టమర్లు లోన్లు రీపే చేసేలానిబంధనలు ఉండే యాప్స్‌‌నే గూగుల్ ప్లే స్టోర్ తన ప్లాట్‌‌ఫామ్‌‌పై అనుమతిస్తోంది. అంతేకాక ప్లే స్టోర్ పాలసీల ప్రకారం ఇన్‌‌స్టా పర్సనల్ లోన్ యాప్స్ రీపేమెంట్‌‌కు సంబంధించి కనీస, గరిష్ట కాల వ్యవధిని వెల్లడించాలి. గరిష్టంగా ఏడాదికి ఎంత వడ్డీరేటు విధిస్తున్నారు? మొత్తం లోన్ ఖర్చు ఎంత అవుతుందో అన్నీ వివరించాలని గూగుల్ చెప్పింది. ఈ నిబంధనలు పాటించకుండా లోన్లు ఇస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోన్న యాప్స్‌‌ను గూగుల్ బ్యాన్ చేస్తోంది. గూగుల్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం డిజిటల్ లెండింగ్ ఇండస్ట్రీలో స్టాండర్డ్ పద్ధతులను పాటించేలా చేస్తుందని ఇండస్ట్రీ ప్రతినిధులు చెప్పారు.  అదేవిధంగా రెగ్యులేటరీ పర్యవేక్షణ పెరుగుతుందని పేర్కొన్నారు. టెక్నికల్ సవాళ్లు ఉండటంతో రెగ్యులేటరీ పర్యవేక్షణ అనేది చాలా కష్టంగానే మారుతోంది. ‘ఇండియాలోని చట్టాల ప్రకారం అన్ని లెండింగ్ యాప్స్‌‌ కూడా తప్పనిసరిగా ఏదేనీ బ్యాంక్ లేదా ఎన్‌‌బీఎఫ్‌‌సీ సమక్షంలో పనిచేస్తూ ఉండాలి. ఇవి ఆర్‌‌‌‌బీఐ వద్ద రిజిస్టర్ అవ్వాలి.  రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌‌ను పాటించాలి. లెండింగ్ విధానాలు కూడా పారదర్శకంగా ఉండాలి. లోన్ల వసూళ్ల విషయంలో ఎలాంటి అన్యాయమైన విధానాలను పాటించకూడదు. అన్ని పాలసీలను తప్పనిసరిగా పాటించాలి’ అని డిజిటల్ లెండింగ్ యాప్ క్యాష్‌‌ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫిన్‌‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్జూమర్ ఎంపవర్‌‌‌‌మెంట్ ఫౌండింగ్ మెంబర్ యోగి సాదన చెప్పారు.

యాప్స్‌‌ వెనక చైనీస్‌‌

ఈ యాప్స్ కొన్నింటి వెనకాల చైనీస్ వారు ఉన్నట్టు, వేల కోట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించారు. 26 ఏళ్ల చైనీస్ వ్యక్తి జియాన్ అలియాస్ మార్క్‌‌ను రాచకొండ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. బిజినెస్ వీసాతో ఇండియాకి వచ్చి, చైనీస్ నేషనల్స్ జు నాన్, జు జిన్‌‌ఛాంగ్, జావో కియావో ఆధ్వర్యంలో ఇతను పనిచేస్తున్నాడని తేలింది. వీరు పలు మైక్రోఫైనాన్స్ కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నట్టు రాచకొండ పోలీసులు గుర్తించారు.  క్రేజీ బీన్, క్రేజీ రూపీ, క్యాష్ ప్లష్, రూపీ ప్రొ, గోల్డ్ బౌల్, ఫస్ట్ క్యాష్, రియల్ రూపీ, రూపీ  మోస్ట్, క్రెడిట్ రూపీ, కూల్ క్యాష్, మనీ నౌ, పాకెట్ రూపీ, రూపీ డే, క్యాష్ గో, క్యాష్ స్టార్, క్యాష్ బౌల్, మనీ రూపీ, గోల్డ్ రూపీ, మనీ హెల్పర్, మనీ బెల్ యాప్స్ వంటి వాటిని వీరు ఆపరేట్ చేస్తున్నారు. పుణే, థానే, మహారాష్ట్రలలో ఈ చైనీస్ వ్యక్తులు కాల్ సెంటర్లను నిర్వహి స్తున్నారు. ఈ యాప్స్‌‌ను గూగుల్ తొలగించినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. వీరి వివరాలను ఈడీ, ఆర్‌‌‌‌బీఐకు షేర్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఆన్‌‌లైన్ ఇన్‌‌స్టాంట్ లోన్ స్కామ్‌‌ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దర్ని కూడా హైదరాబాద్ పోలీసులు అంతకుముందు అరెస్ట్ చేశారు. వారు దేశం విడిచి పారిపోతుండగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరు మన దేశంలో నాలుగు కంపెనీలను నిర్వహిస్తున్నట్టు తేలింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవర్ని కూడా పోలీసులు వదిలి పెట్టడం లేదు. లెండింగ్ యాప్స్‌‌కు సంబంధించి హైదరాబాద్  పోలీసులు 27 కేసులను నమోదు చేశారు. రూ.21 వేల కోట్ల విలువైన 1.4 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు.  ఆర్‌‌‌‌బీఐ డిజిటల్ లెండింగ్‌‌ను రెగ్యులేట్ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఒక కమిటీని నియమించింది.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!