నిజాం పాలనా కాలంలో హైదరాబాద్ సంస్థాన ప్రజలకు వాక్, సభ పత్రికా స్వతంత్రాలు ఉండేవి కావు. రాజకీయ, పౌర హక్కులు మాటే లేదు. ప్రజలు తీవ్ర అణచివేతకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు పలు సంస్థలను స్థాపించారు. ప్రజలలో అవగాహన పెంచి రాజకీయ, పౌర హక్కుల కోసం పాటుపడ్డారు.
యంగ్‌మెన్ ఇంఫ్రూవ్‌మెంట్ సొసైటీ
యంగ్‌మెన్ ఇంఫ్రూవ్‌మెంట్ సొసైటీని 1879లో ముల్లా అబ్దుల్ ఖయ్యూం సహకారంతో అఘోరనాథ్ ఛటోపాధ్యాయ స్థాపించాడు. ఈ సంస్థల మరో పేరు బ్రదర్ హుడ్ సొసైటీ. ఈ సొసైటీ ఆధ్వర్యంలో అఘోరనాథ్ ఛటోపాధ్యాయ ఒక గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఇది హిందూ ముస్లిం ఐక్యతను పెంచి వయోజన విద్యను అందించాలనే ప్రధాన లక్ష్యంతో ఏర్పడింది.
హిందూ సోషల్ క్లబ్
1892లో రాజా మురళీ మనోహర్ బహదూర్ చాదర్‌ఘాట్‌లో ప్రారంభించారు. దీనికి మొదటి అధ్యక్షుడిగా రాజా మురళీ మనోహర్ బహదూర్, ఉపాధ్యక్షుడిగా కృష్ణ అయ్యంగార్ వ్యవహరించారు. ఈ సంస్థ నిజాం హిందూ వివక్షత విధానాలకు వ్యతిరేకంగా పోరాడింది. ఉన్నత విద్యకోసం ఇంగ్లండ్‌కు పంపిస్తున్న విద్యార్థుల్లో హిందువుల పట్ల చూపుతున్న వివక్షత ధోరణిని ఈ క్లబ్ తీవ్రంగా ఖండించింది.
హ్యూమటేరియన్ లీగ్
ఈ సంస్థను హరిజనోద్ధరణ కోసం 1913లో రాయ్ బాలముకుంద్, భాగ్యరెడ్డి వర్మ, సేఠ్ లాల్జీ మేఘ్జీలు స్థాపించారు. రాయ్ బాలముకుంద్ అనే వ్యక్తి ఖత్రి సామాజిక వర్గానికి చెందిన హైదరాబాద్ సంస్థానంలో తొలి హిందూ పట్టభద్రుడిగా గుర్తింపు పొందాడు. ఈయన 1885లో మద్రాస్ యూనివర్సిటీ బీఏ పట్టా పొందాడు. 1890లో హైదరాబాద్‌లో స్థాపించిన హైకోర్టుకు 1908లో న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఈయన భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేశారు.
హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్
ఈ లీగ్‌ను వామన్‌రావు నాయక్, కేశవరావు కొరాట్కర్లు స్థాపించారు. మహిళా విద్య, ప్రాథమిక విద్య, గ్రంథలయాల అభివృద్ధి ప్రధాన ఉద్దేశంతో హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్‌ను ఏర్పాటు చేశారు. 1906లో కేశవరావు వివేక వర్ధిని పాఠశాలను స్థాపించారు.
హైదరాబాద్ యంగ్మెన్స్ యూనియన్
1916లో హైదరాబాద్ యంగ్మెన్స్ యూనియన్ను వామన్‌రావు నాయక్, మౌల్వీ ఎం ముర్తజా, మందముల నరసింహారావు, బూర్గుల నరసింహారావు తదితరుల ఆధ్వర్యంలో ఏర్పడింది. దీనికి అధ్యక్షుడిగా వామనరావు నాయక్, ఉపాధ్యక్షుడిగా ఎం.మౌల్వీ, ఎం.ముర్తుజా వ్యవహరించారు. ఇది యువకుల్లో చైతన్యం నింపడానికి ఏర్పడింది.
లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్స్
1920లో హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ రాజకీయ సంస్థ అయిన లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పడింది. ఇది హైదరాబాద్ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలను నిర్వహించింది. ఈ సంస్థ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీని ఏర్పాటు చేసింది.
హిందూ ధర్మ పరిషత్
హైదరాబాద్ సంస్థానంలో కొంతమంది యువకులు 1925, ఏప్రిల్ 1న రాజా ప్రతాపగిర్జీ అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహించి హిందూ ధర్మ పరిషత్ పేరిట ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం హిందూ మత ఉద్ధరణ. నిజాం ప్రభుత్వ పరిపాలనలో హిందూ ధర్మానికి, ఆచార వ్యవహారాలకు, కట్టుబొట్టుకు, భాషా సంస్కృతులకు స్వేచ్ఛ లేకపోయేది. ఈ సభా వేదికపై మతపరమైన తీర్మానాలతోపాటు కొన్ని రాజకీయ తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు. పండిత శేషాద్రి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. హరిజనోద్ధరణ విషయమై తీర్మానం ప్రవేశ పెట్టగానే సభలో ఉన్న పండితులు, సనాతన ధర్మాచరణ పరాయణులు, సంప్రదాయవేత్తలు అభ్యంతరం ప్రకటించారు. ఈ అభ్యంతరాల మధ్యనే భాగ్యరెడ్డి వర్మ తీర్మానాన్ని బలపరుస్తూ అస్పృశ్యుల దుర్భర జీవితాలను వర్ణిస్తుంటే మంత్రముగ్ధులైన సభికులు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్
1926లో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు లండన్‌లో సొసైటీ ఆఫ్ ఇండియన్ అండ్ ప్రోగ్రెస్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఇది బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ప్రజలను చైతన్యవంతులను చేసింది. ఈ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ 1919లో నిజాం ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ కౌన్సిల్లో సంస్కరణల అమలుకు ఎన్నో ఉద్యమాలు చేసింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం జవాబుదారీ ప్రభుత్వం.
హిందూ స్థాయీ సంఘం
1932లో రెసిడెన్సీ బజార్లో కాశీనాథరావు వైద్య హిందూ స్థాయీ సంఘాన్ని స్థాపించారు. ఈ సంస్థ స్వదేశీ వస్తు విక్రయం తదితర కార్యక్రమాలను నిర్వహించింది.
ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఈ సంస్థ మొదటి అధ్యక్షుడు అక్విలాల్ అలీఖాన్. మొదటి మహాసభ 1942, డిసెంబర్ 11న రెడ్డి హాస్టల్లో జరిగింది. రెండో సభ 1943, నవంబర్ 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరిగింది. మూడో సభ 1946లో కోఠిలో జరిగింది.
హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్
హైదరాబాద్ నగరానికి చెందిన విద్యావంతులు రాజ్యాంగ సంస్కరణలు సాధించాలనే లక్ష్యంతో 1921లో హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. దీనిని వామనరావు నాయక్, కేశవరావు కొరాట్కర్, రాఘవేంద్రరావు శర్మ, అస్గర్ హుస్సేన్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నిజాం రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల ద్వారా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
ఆంధ్ర జన సంఘం
1921, నవంబర్ 11, 12వ తేదీల్లో హైదరాబాద్ గౌలిగూడలోని వివేకవర్ధిని ఆడిటోరియంలో హైదరాబాద్ సోషియల్ కాన్ఫరెన్స్(హైదరాబాద్ సంఘ సంస్కరణ సభ సమావేశం) జరిగింది. ఈ సమావేశానికి మహర్షి కార్వే అధ్యక్షత వహించారు. ఇందులో వక్తలు ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ భాషల్లో ప్రసంగించారు. కార్వే ప్రసంగం మరాఠీ, ఇంగ్లీష్‌లో సాగింది. మాడపాటి హనుమంతరావు మొదటి రోజు తెలుగులో ప్రసంగించారు. ఈయన తెలంగాణలో గొప్ప వక్త. అగ్రనాయకుడు కావడం వల్ల హనుమంతరావు ప్రసంగాన్ని ఎవరూ అడ్డుకోలేదు. నవంబర్ 12న హైదరాబాద్ న్యాయవాది అల్లంపల్లి వెంకటరావు తెలుగులో ప్రసంగించగానే కన్నడిగులు, మరాఠీలు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో అల్లంపల్లి తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. సభలో తెలుగు వక్తలు దీనిని పెద్ద అవమానంగా భావించారు. 1921, నవంబర్ 12న రాత్రి 8 గంటలకు హైకోర్టు న్యాయవాది టేకుమల రంగారావు ఇంట్లో సమావేశం అయ్యారు. తెలుగువారి భాషా సంస్కృతులను కాపాడేందుకు ఆంధ్ర రాష్ట్ర జన సంఘం (రాజకీయేతర జనసంఘం) ను స్థాపించారు. ఈ సంఘం మొదటి కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావు నియమితులయ్యారు. దీనిని టేకుమల్ల రంగారావు స్వగృహంలో ఏర్పాటు చేశారు. రంగారావు ఆంధ్ర రాష్ట్ర జనసంఘం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
తొలి సమావేశం
ఆంధ్రజన సంఘం తొలి సమావేశం 1922, ఫిబ్రవరి 14న రెడ్డి వసతి గృహం లో కొండా వెంటకరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం పేరును నిజాం రాష్ట్ర జనసంఘంగా మార్చారు. ఈ సమావేశం కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావును ఎన్నుకు న్నారు. తెలంగాణలో సామాజిక, సాం స్కృతిక రాజకీయ ఉద్యమాలను చేపట్ట డంలో ఆంధ్ర జన సంఘం ముఖ్యపాత్ర ను పోషించింది. ఈ సంస్థ స్ఫూర్తితో మరెన్నో సంస్థలు పుట్టుకొచ్చాయి.