వర్ధన్నపేట, వెలుగు : ప్రైవేట్ బస్సు, బైక్ ఢీకొని నలుగురు యువకులు చనిపోయారు. ప్రమాదం వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారులో బుధవారం రాత్రి జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక సిద్ధు, కాశిమల్ల వరుణ్ తేజ, గణేశ్, పొన్నాల అనిల్‌కుమార్ బైక్‌పై వర్ధన్నపేటకు వస్తున్నారు. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వర్ధన్నపేట శివారులో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్ధు, వరుణ్, గణేశ్ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌కుమార్ దవాఖానాలో చనిపోయాడు.
నల్గొండ జిల్లాలో ఇద్దరు ..
దేవరకొండ (పీఏపల్లి): కారు అదుపుతప్పి వాటర్ ట్యాంక్ దిమ్మెను ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం గణపురం స్టేజీ సమీపంలో బుధవారం జరిగింది. హైదరాబాద్‌లోని యాకుత్‌పురకు చెందిన ఎండీ. అజార్ (32), ఎండీ. సమీరా బేగం (28) ఎండీ. జహీర్, మదియా ఫ్రెండ్స్. వీరు నలుగురు నాగార్జునసాగర్ చూసేందుకు బుధవారం కారులో వస్తున్నారు.
ఈ క్రమంలో పీఏపల్లి మండలం గణపురం స్టేజ్ దాటగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న హెచ్‌ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ దిమ్మెను ఢీకొట్టింది. దీంతో కారు ముందు సీట్లలో కూర్చున్న అజార్, సమీరా బేగం స్పాట్‌లోనే చనిపోగా, జహీర్, మదియ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమని గుడిపల్లి ఎస్సై నర్సింహులు తెలిపారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.