యాదగిరిగుట్ట, వెలుగు : బతుకమ్మ పేరుతో రూ.90 కూడా విలువ చేయని చీరలను పంపిణీ చేస్తూ సీఎం కేసీఆర్ మహిళలను అవమానిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మంత్రుల కుటుంబ సభ్యులు కూడా ఈ చీరలు ధరించి బతుకమ్మ ఆడాలని సవాల్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో సోమవారం ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్యతో కలిసి చాకలి అయిలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరమైన పనులకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ నాసిరకం చీరలు పంపిణీ చేయడం సరికాదన్నారు. బతుకమ్మ పండుగ కానుకగా ప్రతి మహిళకు పట్టుచీర అందించాలని డిమాండ్ చేశారు.
మంత్రివర్గంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ సభ్యులే లక్షల కోట్లు వెనుకేసుకున్నారని ఆరోపించారు. చాకలి అయిలమ్మను స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్‌పై పోరాటానికి నడుం బిగించాలన్నారు. గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న రజక సంఘం భవన నిర్మాణానికి సొంతంగా రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నెమిల రాజ్యలక్ష్మి రాంచందర్, యాదగిరిగుట్ట, ఆలేరు ఎంపీపీలు చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్, జడ్పీటీల తోటకూరి అనురాధ బీరయ్య, గుట్ట మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌గౌడ్ పాల్గొన్నారు.