- ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌కు స్టేట్ కన్జ్యూమర్ ఫోరం ఆదేశం
హైదారాబాద్ సిటీ, వెలుగు: ఇన్సూరెన్స్ డబ్బులు రూ.2 లక్షలు 9 శాతం వడ్డీతో సహా మృతురాలి కుటుంబానికి చెల్లించాల్సిందేనని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నల్గొండ బ్రాంచ్‌కు జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చిన ఆదేశాలను స్టేట్ కన్జ్యూమర్ ఫోరం సమర్థించింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వేసిన అప్పీల్ పిటిషన్ ను కొట్టివేసింది. నల్గొండ జిల్లాకు చెందిన చల్ల వెంకయ్య.. 2012లో తన భార్య పేరు మీద ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏడాదికి రూ.50 వేలు ప్రీమియంతో రూ.3.50 లక్షలకు పాలసీని తీసుకున్నారు.మూడు ప్రీమియంలు రూ.1లక్ష 50వేలు చెల్లించారు. 2015లో వెంకయ్య భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ కోసం అప్లై చేశారు.
కంపెనీ రూ.3.50 లక్షలకు బదులు వెంకయ్య చెల్లించిన రూ.1.50 లక్షల ప్రీమియం మాత్రమే తిరిగి ఇచ్చింది. దాంతో బాధితులు జిల్లా వినియోగదారుల ఫోరంను సంప్రదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఫోరం..మిగితా డబ్బులు రూ.2లక్షలు 9% వడ్డీతో సహా చెల్లించాలని, రూ.10 వేలు పరిహారం, రూ.2 వేలు ఖర్చులకు మృతురాలి కుటుంబానికి ఇవ్వాలని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నల్గొండ బ్రాంచ్‌కి ఆదేశాలిచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీ స్టేట్ కన్జ్యూమర్ఫోరమ్ను ఆశ్రయించింది. కస్టమర్ కు గతంలో ఉన్న వ్యాధుల వివరాలను దాచారని, మూడవ ప్రీమియం సకాలంలో చెల్లించలేదని అప్పీల్ చేసింది. సరైన ఆధారాలు చూపకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తూ..పూర్తి డబ్బులు ఇవ్వాల్సిందేనని స్టేట్ కన్జ్యూమర్ ఫోరం స్పష్టం చేసింది. జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పును సమర్థించడంతోపాటు అప్పీల్‌ను కొట్టివేసింది.