రెండేళ్ల తర్వాత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇన్సూరెన్స్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మేనేజ్మెంట్ ఎట్టకేలకూ ఇన్సూరెన్స్ చేయించింది. రెండేళ్ల తర్వాత మొత్తం 6104 మంది విద్యార్థులకు ఆరోగ్య బీమా కల్పించింది. ఒక్కో విద్యార్థికి 350 చొప్పున ఏడాదికి 21,36,400 ప్రీమియం చెల్లించారు. బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ టైంలోనే విద్యార్థుల నుంచి బీమా ప్రీమియాన్ని వసూలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా విద్యార్థుల నుంచి డబ్బు తీసుకున్నా.. కాలేజీ మేనేజ్మెంట్ బీమా చేయించలేదు.

విద్యార్థుల ఇన్సూరెన్స్కు సంబంధించి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. ఆరోగ్య బీమా కింద 30 వేలు, ప్రమాద బీమా రూపంలో లక్ష రూపాయలకు చెల్లించేలా ఇన్సూరెన్స్ చేయించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం బీమా వర్తిస్తుంది. అయితే ప్రభుత్వరంగ సంస్థలతో బీమా ఒప్పందం చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టల్ బీమాతో విద్యార్థులకు ఎక్కువ లాభం చేకూరేదని పేరెంట్స్ అంటున్నారు.