రైతులకు గుడ్​న్యూస్​: కూరగాయలు.. పండ్ల సాగు రైతులకు ప్రత్యేక రాయితీలు

రైతులకు గుడ్​న్యూస్​: కూరగాయలు.. పండ్ల సాగు రైతులకు ప్రత్యేక రాయితీలు
  • కూరగాయలు, పండ్ల సాగుకు ఒక్కో జిల్లాకు 4.50 కోట్లు
  • ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్​మెంట్ స్కీమ్ కింద నిధులు
  • ఎరువులు, సోలార్ ఫెన్సింగ్​పై ప్రత్యేక రాయితీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నది. ఈ మేరకు రైతులకు సబ్సిడీలు అందించేందుకు సిద్ధమవుతున్నది. హార్టికల్చర్ పంటలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని రైతులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

 కూరగాయలు, పండ్ల తోటల సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి వాటిని క్లస్టర్లుగా విభజించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. జిల్లాలు, మండలాల్లో క్లస్టర్ల వారీగా సాగును రాష్ట్ర సర్కార్ ప్రోత్సహించనున్నది. ఏ కూరగాయలు.. ఎలాంటి పండ్లు ఎక్కడెక్కడ పండించే వీలున్నదో గుర్తిస్తున్నది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్​మెంట్ స్కీమ్​ను అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఇటీవలి ఈ స్కీమ్ కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.145 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఫండ్స్ కేటాయించి హార్టికల్చర్ పంట సాగు అభివృద్ధికి సన్నాహాలు చేస్తున్నది.

మార్కెట్లకు తరలించేలా ఏర్పాట్లు

పట్టణాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న పంటల సాగుకే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అతి కొద్దిమంది రైతులే కూరగాయలు పండిస్తున్నారు. కూరగాయల సాగును ప్రోత్సహించి దగ్గర్లోని పట్టణాలతో పాటు జిల్లా, హైదరాబాద్ మార్కెట్లకు తరలించేలా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించనున్నారు. 

ముందుగా ప్రతి జిల్లాకు రూ.4.50 కోట్ల వరకు నిధులు కేటాయించనున్నారు. చాలా గ్రామాల్లో మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, సపోట, అల్లనేరేడు, బత్తాయి, బొప్పాయి, దానిమ్మ పండ్లు సాగు చేసే అవకాశాలున్నాయి. పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు మొక్కలు, ఎరువులు, పురుగుల మందులు రాయితీతో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

స్థానిక ప్రజల అవసరాలు పోగా, మిగిలిన వాటిని ఎగుమతి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కోతులు, అడవి పందుల నుంచి హార్టికల్చర్ పంటలను కాపాడుకునేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు సబ్సిడీతో రుణాలు ఇవ్వనున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద వివిధ రకాల పరికరాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నది.