
- రూ.11 కోట్లతో నిర్మించినా ఫలితం శూన్యం
- కొనుగోలు, అమ్మకందారులు లేక మార్కెట్ వెల వెల
తూప్రాన్, వెలుగు: ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల ముందస్తు ఆలోచన లేకపోవడంతో కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిరూపయోగంగా మారింది. పట్టణానికి దూరంగా ఉందనే కారణంతో అమ్మకం దారులు దుకాణాలు ఏర్పాటు చేయక, కొనుగోలుదారులు రాక అత్యాధునిక వసతులతో నిర్మించిన భవనం క్రయవిక్రయాలు లేక వెలవెలబోతోంది. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో 2018లో రూ.11 కోట్ల నిధులతో నర్సాపూర్ చౌరస్తా సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2022లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ మార్కెట్ ను ప్రారంభించారు.
రెండు అంతస్తుల్లో..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను రెండు అంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో కూరగాయలు, ఫస్ట్ ఫ్లోర్ లో చికెన్, మటన్, చేపలు, సెకండ్ ఫ్లోర్ లో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేశారు. తూప్రాన్ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ వ్యాపారులందరినీ కొత్త మార్కెట్లో దుకాణాలు ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా సరైన గిరాకీ లేదనే కారణంతో వ్యాపారులు దుకాణాలు తిరిగి పాత మార్కెట్ కు తరలించారు. దీంతో రెండేళ్ల కాలంగా 60 పైగా స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం బిల్డింగ్ లో కేవలం నాన్వెజ్, వెజ్ కు సంబంధించి నాలుగు దుకాణాలు మాత్రమే నడుస్తున్నాయి.
టెండర్లు పిలిచినా ఫలితం శూన్యం..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ లో నిర్మించిన షెటర్లను కిరాయికి ఆదాయం సంపాదించేలా ఆఫీసర్లు ప్లాన్ చేశారు. రెండేళ్ల కాలంలో ఐదు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క షెటర్ సైతం తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో ఆ 10 షటర్లు ఇప్పటికీ మూతపడి ఉన్నాయి. ఈ బిల్డింగ్ నిర్వహణకు ఆదాయం లేకపోవడంతో మార్కెటింగ్ శాఖ అధికారులే నెట్టుకొస్తున్నారు.
పాత మార్కెట్ లోనే దుకాణాలు
తూప్రాన్ లో ప్రస్తుతం పాత మార్కెట్ లోనే కూరగాయలు, మాంసం దుకాణాలు నడుస్తున్నాయి. ఈ మార్కెట్ పట్టణంలో కేంద్ర బిందువుగా ఉండడంతో తూప్రాన్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి కూరగాయలు, మాంసం కొనుగోలు చేస్తున్నారు. పాత మార్కెట్ లోనే గిరాకీ బాగుందని వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.
దుకాణాల వేలానికి త్వరలో చర్యలు చేపడతాం
తూప్రాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఉన్న కమర్షియల్ షెటర్ల వేలానికి ప్రతిపాదనలు తయారు చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చే నెలలో బహిరంగ వేలం చేపడుతాం.
జాన్ వెస్లీ, ఏఎంసీ మార్కెట్ సెక్రటరీ, తూప్రాన్