- రామగుండంలో నిలిచిపోయిన నిర్మాణాలు
- 2016 విఠల్‌నగర్‌లో, 2022లో ఎన్టీఆర్‌నగర్‌లో మార్కెట్లకు శంకుస్థాపన
- నిధుల కొరత వల్లే నిలిచిన నిర్మాణాలు?
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని విఠల్‌నగర్, ఎన్టీఆర్‌నగర్ ఏరియాల్లో వీధివ్యాపారుల కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, నేటికీ పనులు పూర్తికాలేదు. కూరగాయలు, నాన్‌వెజ్ ఒకేదగ్గర దొరికేలా, రోడ్ల వెంబడి స్ట్రీట్ వెండర్స్ లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలను ప్రారంభించారు. నిధుల కొరత వల్లే నిర్మాణాలు నిలిచిపోయాయన్న ఆరోపణలున్నాయి.
రూ.4 కోట్లతో విఠల్‌నగర్‌లో
రామగుండం పరిధిలోని గోదావరిఖనిలో పెద్ద మార్కెట్ మేదరిబస్తీ సమీపంలో ఉంది. అన్ని ప్రాంతాల ప్రజలకు ఉపయోగ పడేలా ఇంటిగ్రేటెడ్‌మార్కెట్లను నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఒకేచోట హోల్‌సేల్, రిటైల్ కూరగాయలు, చేపలు, మాంసం, పూలు, పండ్లు, ఇతర నిత్యావసరాలు దొరికేలా ఈ మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. 2016లో విఠల్‌నగర్ మీ సేవా సెంటర్ పక్కన గల ఖాళీ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సీఎం అష్యూరెన్స్ గ్రాంట్స్ (సీఎంఏ) నుంచి రూ. 4 కోట్లు మంజూరు చేశారు.
Also Read :- తెలంగాణలో బీడు భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే
ఈ పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్‌తో పాటు వివిధ రకాల బిజినెస్‌లకు సంబంధించిన గదులలో కొన్నింటికి స్లాబ్, గోడలను నిర్మించగా, మరికొన్నింటికి అసలు పనులే మొదలు పెట్టలేదు. ఈ పనులను పర్యవేక్షించాల్సిన ఆర్‌అండ్‌బీ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ మార్కెట్ ఏరియా చెట్ల పొదలతో నిండిపోయి ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
2022లో ఎన్టీఆర్‌నగర్‌లో
పట్టణంలోని 45వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్‌నగర్‌లో మరో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మాణానికి బల్దియా కౌన్సిల్ తీర్మానం చేసింది. రూ.4.50కోట్ల పట్టణ ప్రగతి నిధులను కేటాయించగా ఆ ఏడాది జూన్‌లో పనులు మొదలు పెట్టారు. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 98 రూమ్‌ల నిర్మాణానికి నిర్ణయించగా పనులు కేవలం పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి.
నిధుల కొరతే కారణమా...?
రామగుండం కార్పొరేషన్‌లో చిరు, వీధి వ్యాపారుల కోసం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి నిధుల కొరత కారణమనేది తెలుస్తోంది. మార్కెట్లలో పలు నిర్మాణాలను చేపట్టిన కాంట్రాక్టర్లకు కొంత మేర బిల్లులు ఇవ్వగా, మిగిలిన బిల్లులు సమకూర్చకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి వెనకడుగు వేసినట్టు సమాచారం. ఎస్డీఎఫ్ నుంచి కానీ, ఆర్థిక సంఘం స్కీమ్ నుంచి కానీ నిధులు కేటాయించి మార్కెట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఇక్కడి వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.