కాజీపేటలో రైల్వే కోచ్‍, వ్యాగన్‍ షెడ్లు రెడీ అయితున్నయ్..162 ఎకరాల్లో ప్రాజెక్ట్ పనులు

కాజీపేటలో రైల్వే కోచ్‍, వ్యాగన్‍ షెడ్లు రెడీ అయితున్నయ్..162 ఎకరాల్లో ప్రాజెక్ట్ పనులు
  • 2025 ఆగస్ట్ నాటికి కంప్లీట్ కు టార్గెట్ 
  • రూ.680 కోట్లతో కోచ్‍ ఫ్యాక్టరీ నిర్మాణాలు
  • భారీ సైజులో 4  షెడ్లు.. ఇంటర్నల్‍ రైల్వే ట్రాక్‍లు
  • 12 వేల మందికి ఉపాధి అవకాశాలు

వరంగల్‍, వెలుగు : మన దేశ ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే కాజీపేటలో ఇంటిగ్రేటెడ్‍ రైల్వే కోచ్‍ ఫ్యాక్టరీ ఏర్పాటు పనుల్లో స్పీడ్ పెరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో హామీగా కోచ్‍ ఫ్యాక్టరీ ఉంది.  ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో కేంద్రం కోచ్‍ ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్‍ ఇచ్చింది. ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫ్యాక్టరీకి అవసరమైన నిర్మాణ పనులు చేపట్టారు. 

పీఓహెచ్‍ నుంచి ఇంటిగ్రేటెడ్‍ రైల్వే కోచ్‍ ఫ్యాక్టరీ

దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట జంక్షన్ కీలకంగా ఉంది. ఇక్కడ కోచ్‍ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నాలుగైదు దశాబ్దాలుగా డిమాండ్‍ ఉంది. ఇందులో భాగంగా 2010లో పిరియాడికల్‍ ఓవర్‍ హాలింగ్‍ వర్క్ షాప్‍ (పీఓహెచ్‍) ఏర్పాటుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‍ఎస్‍ సర్కారు భూసేకరణ పేరుతో 2014–15 వరకు సమయం వృథా చేసింది. పీఓహెచ్‍ను 2016లో కేంద్రం వ్యాగన్‍ మాన్యుఫ్యాక్చరింగ్‍ యూనిట్‍గా అప్‍గ్రేడ్‍ చేసింది. కాజీపేటలో వ్యాగన్ల తయారీ ఉంటుందని పేర్కొంది.  

2023 జులై 8న ప్రధాని మోదీ వరంగల్‍ జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే పీఓహెచ్‍, వ్యాగన్‍ మాన్యు ఫ్యా క్చరింగ్‍ యూనిట్‍ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఇది కాస్త రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు వేదికగా మారింది. రాష్ట్ర విభజన చట్టం హామీపై ప్రస్తుత రేవంత్‍రెడ్డి సర్కార్‍ పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానితో సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి పెంచింది. తద్వారా కాజీపేటలో కోచ్‍ ఫ్యాక్టరీ కల నెరవేరింది. ఇది ఏర్పాటైతే.. ప్రత్యక్షంగా 6 వేలమందికి, పరోక్షంగా మరో 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

వచ్చే ఏడాది ఆగస్ట్ టార్గెట్‍ గా పనులు స్పీడప్‍ 

ప్రధాని మోదీ శంకుస్థాపన చేశాక గత మార్చి నుంచి కాజీపేట జంక్షన్‍ పక్కనుండే అయోధ్యపురంలోని 162 ఎకరాల్లో పనులు ప్రారంభించారు. రైల్ వికాస్‍ నిగమ్‍ లిమిటెడ్‍ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు.  హైదరాబా ద్‍కు చెందిన పవర్‍మెక్‍ టైకిషా జేవీ సంస్థ రూ.383 కోట్లతో ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకుంది. నిర్మాణ పనులు కొనసాగుతుండగానే.. మరోవైపు కోచ్‍ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ పెరిగింది. దీంతో  గత సెప్టెంబర్‍ 9న ప్రాజెక్టులను అప్‍గ్రేడ్‍ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఓవర్‍ హాలింగ్‍ వర్క్ షాప్‍ను ఇంటిగ్రేటెడ్‍ రైల్వే కోచ్‍ ఫ్యాక్టరీగా అప్‍గ్రేడ్‍ చేసినట్లు గత నవంబర్‍ 28న రైల్వే అధికారులు అధికారిక ప్రకటన చేసి..

Also Read :- రెండు మిల్లుల్లో.. రూ. 217 కోట్ల సీఎంఆర్‌‌ మాయం

రూ.680 కోట్లు  కేటాయించారు. పనుల కోసం మరో రూ.66 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం రైల్వే శాఖ  ఆదేశాలతో చెన్నైతోపాటు ఇతర కోచ్‍ ఫ్యాక్టరీలకు చెందిన అధికారులు కాజీపేటకు వచ్చి నిర్మాణ పనుల్లో సూచనలు చేశారు. 2025 ఆగస్ట్ నాటికి కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలనే టార్గెట్ గా పెట్టుకుని పనుల్లో స్పీడ్ పెంచారు. ఇది పూర్తయి అందుబాటులోకి వస్తే.. కాజీపేట కోచ్‍ ఫ్యాక్టరీ ఏటా 600 కోచ్‍లు తయారు చేయనుంది. 

కోచ్ లు తయారు చేయాలంటే ఇవి నిర్మించాలి  

ఫ్యాక్టరీలో కోచ్‍ల తయారీ నుంచి బయటకు పంపేవరకు కీలకమైన ఇంటర్నల్‍ రైల్వే లైన్లతో పాటు టెస్ట్ షాప్‍, అడ్మినిస్ట్రేటివ్‍ బ్లాక్‍, ఎలక్ట్రికల్‍ సబ్‍ స్టేషన్‍, సెక్యూరిటీ పోస్ట్, రెస్ట్ హౌస్‍, సీవేజ్‍ ట్రీట్మెంట్‍ ప్లాంట్‍, ప్యాకెజ్‍ సబ్‍ స్టేషన్‍, షవర్‍ టెస్ట్, రోడ్‍ వేబ్రిడ్జి, పంప్‍ హౌస్‍, పీఐటీ ట్రావెర్సర్‍, వ్యాగన్‍ వే బ్రిడ్జి, గార్డ్ పోస్ట్, పార్కింగ్‍, 2000 కేఎల్‍ కెపాసిటీ పాండ్‍, స్క్రాప్‍ బిన్స్, క్యాంటీన్‍తో పాటు భవిష్యత్‍ అవసరాలకు టర్న్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.

నాలుగు భారీ షెడ్లలో వ్యాగన్‍, కోచ్ ల మేకింగ్ 

వ్యాగన్‍, కోచ్‍ల తయారీ అంతా నిర్మించే మొత్తం 4  భారీ షెడ్లలోనే జరగనుంది. ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో తెలిపే నమూనాలో చూపినట్లుగా మెయిన్‍ బిల్డింగ్‍ షెడ్‍లో వ్యాగన్‍ మాన్యుఫ్యాక్చరింగ్‍ మెషినరీ ఉండనుంది. ఇక్కడ బోగిలతో పాటు వందే భారత్‍, జర్ననీ టెక్నాలజీతో కూడిన లింక్‍ హాఫ్‍మన్‍ బుష్‍(ఎల్‍హెచ్‍బీ), సబర్మన్‍ రైళ్లకు వాడే ఎలక్ర్టిక్‍ మల్టిపుల్‍ యూనిట్‍ (ఈఎంయూ) వంటి కోచ్‍లను తయారు చేశాక..

ఇంటర్నల్‍ రైల్వే ట్రాక్‍ ద్వారా రెండో షెడ్‍లోని పెయింట్‍ షాప్‍కు చేరుతాయి. మోడ్రన్‍ టెక్నాలజీ రోబోట్స్ కోచ్‍లకు అవసరమైన పేయింట్‍ వేస్తాయి. ఇలాంటి టెక్నాలజీని తొలిసారిగా రాష్ట్రంలో వినియోగిస్తుండగా.. మూడో షెడ్డును స్టోర్‍ వార్డ్ గా వాడతారు. ఇందులో వ్యాగన్‍, కోచ్‍ తయారీల మెటిరియల్‍ ఉంటుంది. నాలుగో షెడ్డుగా స్క్రాప్‍ వార్డ్ ఉంటుంది. పనుల్లోని వేస్టేజ్‍ మొత్తం ఇక్కడకు చేర్చుతారని పనుల పర్యవేక్షణ అధికారులు తెలిపారు.