బతికేదెట్టా సామీ : ఇంటెల్ కంపెనీలో వేలాది మంది తొలగింపునకు రంగం సిద్ధం

బతికేదెట్టా సామీ : ఇంటెల్  కంపెనీలో వేలాది మంది తొలగింపునకు రంగం సిద్ధం

ఐటీ అంటే హ్యాపీ అనుకునే రోజులు పోయాయా.. ఒకర్ని చూసి మరొకరు.. ఒక కంపెనీ చూసి మరో కంపెనీ.. ఇలా పోటాపోటీగా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నాయి. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా 380 కంపెనీలు.. ఒక లక్షా 9 వేల 297 మంది ఉద్యోగులను తొలగించాయి ఐటీ కంపెనీలు. 

ఇవన్నీ ప్రత్యక్ష ఉద్యోగాలు.. అంటే పర్మినెంట్ కింద పని చేస్తున్నవారు.. వీళ్లు కాకుండా కాంట్రాక్ట్ కింద.. ఏజెన్సీల కింద పని చేస్తున్న మరో లక్ష మంది ఐటీ ఉద్యోగులు.. తమ ఉద్యోగాన్ని కోల్పోయారు.. ఈ బాటలో ఇప్పుడు మరో ప్రముఖ ఐటీ కంపెనీ.. చిప్ తయారీ కంపెనీ అయిన ఇంటెల్ సంస్థ.. భారీ లేఆఫ్స్ ఉండనున్నట్లు ప్రకటించి కలకలం రేపింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

బ్లూమ్‌ బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఇంటెల్ సంస్థలో 2022లో 1,31,900 మంది ఉద్యోగులు ఉండగా మార్కెట్ లో వచ్చిన ఒడిదుడుకుల దృష్ట్యా 2023లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 124,800కి తగ్గించింది. 2024 ప్రథమార్థంలోనే మార్కెట్ అనిశ్చితి కారణంగా వచ్చే సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని మరలా ఉద్యోగాల్లో కోత పెట్టింది. ప్రస్తుతం ఇంటెల్ సంస్థలో 1,10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 

కాగా మరోసారి ఖర్చులను తగ్గించుకునేందుకు మరిన్ని ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది.  ఇంటెల్ కంపెనీ క్షీణిస్తున్న మార్కెట్ వాటాను పునరుద్ధరించుకోవడానికి, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వేలాది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. వ్యక్తిగత కంప్యూటర్,సర్వర్ మార్కెట్‌లలో ఆధిపత్యానికి పేరుగాంచిన ఇంటెల్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)అప్లికేషన్‌లలో ఉపయోగించే చిప్‌ల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. 

ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి,CEO పాట్ గెల్సింగర్ ఇంటెల్ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం, అధునాతన చిప్ టెక్నాలజీలలో పెట్టుబడులు పెట్టడం,కొత్త మార్కెట్ విభాగాల్లోకి ప్రవేశించడంపై దృష్టి సారించింది. కాగా ఈ చర్యతో 2025 నాటికి $10 బిలియన్ల వరకు ఆదా చేయవచ్చని ఇంటెల్ కంపెనీ భావిస్తున్నట్లు బ్లూమ్‌ బెర్గ్ న్యూస్ నివేదిక పేర్కొంది.