మేధావులూ మౌనాన్ని వీడండి!

మేధావులూ మౌనాన్ని వీడండి!

మాకు ఒకే లక్ష్యం. అవినీతి రహిత ప్రపంచం కావాలి’ అని ట్రాన్స్‌‌పరెన్సీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ గొంతెత్తి చెబుతోంది. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం జర్మనీలోని  బెర్లిన్​లో  ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100+ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

దాని ప్రధాన ఉద్దేశం, కర్తవ్యం ఏమిటంటే.. అవినీతిని బహిర్గతం చేయడం, అవినీతిని ఎదుర్కొనడం, అవినీతిని అంతం చేయడం. సమాజంలోని అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో అవినీతిని నివారించడంతో పాటు పారదర్శకత, బాధ్యతను పెంపొందించడం, నిజాయితీని ప్రోత్సహించడమే ఆ సంస్థ ప్రధాన ఉద్దేశం.  ట్రాన్స్‌‌పరెన్సీ  ఇంటర్నేషనల్  సంస్థ 1993లో  ఏర్పాటు అయింది.

ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్​ సంస్థ ప్రధాన కార్యకలాపాలు.. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సూచిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేశాల అవినీతి స్థాయిని అంచనా వేయడం.  ప్రభుత్వ పాలనలో పారదర్శకత, వ్యాపార సంస్థలు అవినీతి రహితంగా ఉండేలా సిఫార్సులు, పర్యవేక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టడం.  

అదేవిధంగా అవినీతి వ్యతిరేక చట్టాల కోసం ప్రచారం,  వివిధ దేశాల్లో కఠినమైన చట్టాలను అమలు కోసం ప్రయత్నాలు, విధాన మార్పులకు ఒత్తిడి,  విజిల్ బ్లోయర్సు, బాధితులకు సహాయం, అవినీతిని బయటపెట్టే వ్యక్తులకు రక్షణ కల్పించడం కోసం సహాయం అందించడం.

అవినీతి ర్యాంకులో మనమెక్కడ?

ఈ నెల 11న ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్.. ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2024 సంవత్సరం  కరప్షన్ పర్సెప్షన్​ ఇండెక్స్ సూచికను విడుదల చేసింది. జీరో మార్కులు వచ్చిన దేశం అత్యధికంగా అవినీతి పాల్పడుతుందని, అదేవిధంగా 100 మార్కులు వచ్చిన దేశం అవినీతి రహిత దేశంగా ఉందని సూచిస్తోంది. కొన్ని పద్ధతుల్లో అధ్యయనం ప్రతి ఏడాది జరుగుతోంది. 

180 దేశాల్లో ఆ దేశంలోని పరిపాలనలో భాగంగా జరుగుతున్న అవినీతి గురించి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఏ ర్యాంక్​లో  ఉందో వారి అధ్యయనం ద్వారా తెలిపింది.  అందులో  మన దేశ ర్యాంకు 96వ స్థానంలో నిలిచింది. వారి అధ్యయనం ప్రకారం మన దేశానికి 38 మార్కులు వచ్చాయి.  అయితే,  2023 ఏడాదిలో మనదేశం 39 మార్కులు  సాధించి  ప్రపంచవ్యాప్తంగా 93వ  ర్యాంకు సాధించింది. 

గత ఏడాది కంటే ఈఏడాది మనదేశ అవినీతి ర్యాంక్​ మరింత పెరగడం శోచనీయం. ఈ ఏడాది శ్రీలంక 121వ,  పాకిస్తాన్ 135వ ర్యాంక్​తో మన తర్వాత స్థానంలో ఉన్నాయి. జపాన్,  యూ.కె. 20వ ర్యాంకుతో, అమెరికా 63వ ర్యాంకు, చైనా 76వ  ర్యాంకుతో మన కంటే తక్కువ అవినీతి దేశాల జాబితాలో ఉన్నాయి. మన తర్వాత స్వాతంత్ర్యం పొందిన దేశాలు  పాలనలో  ఖచ్చితమైన చర్యలు అవలంబించి అవినీతిని అరికట్టుకొని మంచి మార్కులు సాధించి పై స్థాయిలో ఉన్నాయి. 

విశ్వసనీయతను దెబ్బతీస్తున్న అబద్ధాలు

నాగరిక ప్రపంచంలో అవినీతి వల్ల మనుషుల మధ్యనమ్మకాలు మందగిస్తాయని, అవినీతితో ప్రజాస్వామ్యం బలహీన పడుతుందని, అవినీతే  నిరుద్యోగానికి, పేదరికానికి,  వలసలకు కారణమనే విషయం తెలిసిందే.  

అది తెలిసి కూడా మనం  కుల, మత, ప్రాంత, లింగ భేదాలతో ఘర్షణ పడుతున్నాం. ఒక దేశంలో అవినీతి పెరిగితే   ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం సన్నగిల్లుతుంది. అబద్ధపు ప్రచారాలు చేసుకోవడం వల్ల ప్రజల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోతుంది.

ALSO READ | నక్సలిజం చరిత్రగా మిగలనుందా?

 ప్రజలు తమ ఓటును నాయకులు మీద నమ్మకం లేక అమ్ముకుంటారు. నాయకులు కూడా విపరీతంగా ఎన్నికల్లో ఖర్చు చేసి ఆ తర్వాత ప్రజల సొమ్ము దోచుకుంటారు. మేం ఏమీ తక్కువ కాదని అధికారులు కూడా లంచం తీసుకోకుండా పని చేయరు. అవినీతి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. పారదర్శకత తగ్గి, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. 

న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపించి చట్టాల అమలును అడ్డుకుంటుంది. అధికార దుర్వినియోగం పెరిగి,  ధనికులు అలాగే అధికారంలో ఉన్నవారు లాభపడేలా చేస్తుంది. సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలు ఎన్నికలపై ఆసక్తి కోల్పోయి,  పాలనలో  పాల్గొనడం తగ్గిపోతుంది. 

మౌనం వీడాలి

మౌనంగా ఉన్న మేధావులకు తెలియదా అంటే తెలుసని చెప్పాలి. కానీ,  ప్రస్తుతం వారిని మనం చట్టసభల్లోకి  పంపలేం, వారు ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చు భరించి రాజకీయాలలో ప్రవేశించలేరు.  సమాజంలో  మేధావులకు కొదవేమీ లేదు. మనకెందుకులే అని,  మార్పుకోసం ధైర్యం చేయలేక  తటస్థులుగా మిగిలిపోతున్నారు.

 అలాగే, తాము మేధావులమని నిజాయితీపరులమని ఇతరుల మేధస్సును నిజాయితీని ఒప్పుకోరు. ఇతరులను కలుపుకోరు. మంచి వారిని ప్రోత్సహించలేరు. భారత సమాజంలో ఉన్న  ఈ రుగ్మత పోవాలి. మేధావులు ధైర్యంగా ముందుకురావాలి. అవినీతి అంతంలో కీలక పాత్ర పోషించాలి.  ప్రజల బతుకులకు భరోసా కల్పించి, దేశాన్ని సంపన్న దేశాల సరసన చేర్చే ప్రయత్నం నిరంతరం జరగాలి.

దేశానికి నిజాయితీ నాయకుడు కావాలి

మన స్వాతంత్ర్య పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగింది.  మనవాళ్లు  మనకు సహకరించకపోవడం, ఐక్యత కొరవడడం వలన  స్వాతంత్ర్యం ఆలస్యమై ఎందరినో కోల్పోయామని చరిత్ర చెపుతుంది. 

మన అభివృద్ధికి ఆటంకం అవినీతియేనని తెలుసుకుంటే మంచిది. ఒక బలమైన, దేశభక్తి గల నిరహంకారి, నిజాయితీ కలిగిన సమర్థుడైన నాయకుడు ఉంటే చాలు..ఈ దేశం బాగుపడుతుంది. మన భవిష్యత్తు తరాల కోసం  మనం  ఆయన అన్వేషణలో ఉందాం. 

అనేక అనర్థాలకు కారణం అవినీతే!

అవినీతి పెరుగుదల వల్ల ప్రజాస్వామ్యం తన అసలు ఉద్దేశాన్ని కోల్పోయి, అధికార దుర్వినియోగం పెరిగేలా చేసి నియంతృత్వ పాలనకు మార్గం సుగమం చేస్తుంది. అవినీతి వల్ల ఉద్యోగావకాశాలు తగ్గి నిరుద్యోగం పెరుగుతుంది. 

పారదర్శకత లేకపోవడం, న్యాయసమ్మతమైన అవకాశాలు అందకపోవడం వలన పెట్టుబడిదారులు భయపడతారు. ఫలితంగా కొత్తగా పెట్టుబడులు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఈ పరిస్థితి వల్ల ప్రతిభావంతులు గుర్తింపులేక, మెరుగైన అవకాశాల కోసం  విదేశాలకు వలస వెళ్లడంతో బ్రెయిన్ డ్రైన్‌‌కు దారితీస్తుంది. అంతేకాకుండా,  ఆర్థిక అభివృద్ధి కూడా నిలిచిపోయి పేదరికం పెరుగుతుంది. ఇవాళ మన దేశంలో జరుగుతున్నది కూడా దాదాపు ఇదే.

బాధ్యతలు మరిస్తే హక్కులు అసాధ్యం

మనదేశంలో మనం అందరూ చేసేది తప్పులేనని తెలుసు.  కాకపోతే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అంతే.  తమకు తాముగా సర్దుబాటు చేసుకుంటూ బతికేస్తున్నాం. భారతీయులమైన మనం మార్పుకోసం ప్రయత్నం చేయం.   

అలాగే, మార్పుకోసం పోరాటం చేసే వారికి సహకరించం. సామాన్య ప్రజలకు పూర్తిగా ప్రజాస్వామ్య ఫలాల గురించి తెలియక తమ బాధ్యతలను మరిచి హక్కుల గురించి మాట్లాడుతుంటారు. భవిష్యత్ కోసం సంపాదన, కట్టుబాట్ల మధ్య, భ్రమల్లో  జీవిస్తూ ఇతరులను విపరీత పోకడలతో, సహనాన్ని కోల్పోయి నిందిస్తూ ఉంటారు.  కాలయాపన చేస్తారు. ఇదే మన సమాజం వెనుకబాటుకు ప్రధాన కారణం. 

-సోమశ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి,ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్