గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాకు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ కావాలని జిల్లా మేధావులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ఫంక్షన్ హాల్ లో ఆదివారం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో అనేక నిర్మాణాలు జరిగాయని తెలిపారు. అధికారులు సర్వే చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంటలు, చెరువు, రిజర్వాయర్ కబ్జాలను అధికారులు అడ్డుకోవాలన్నారు.
కలెక్టర్, ప్రభుత్వం స్పందించకపోతే తామే ఒక కమిటీగా ఏర్పడి ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. నాలాలు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ లలో కబ్జాకు గురైన వాటిని రక్షించి ప్రజల ఆస్తులను ప్రజలకు చెందేలా కృషి చేస్తామని ప్రజా ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు రామలింగేశ్వర కాంబ్లే, రవీందర్ రెడ్డి, మధుసూదన్ బాబు, వెంకట్ రాములు అన్నారు.