పహల్గాం దాడి వెనుక హఫీజ్ సయీద్ .. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

పహల్గాం దాడి వెనుక హఫీజ్ సయీద్ .. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
  • లష్కరే తోయిబా ప్యాటర్న్​లోనే కాల్పులు
  • ఆయుధాలూ ఎల్ఈటీవే అనుమానిస్తున్న నిఘా సంస్థలు
  • జమ్మూలో హిందువుల రక్తం పారిస్తామన్న హఫీజ్

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ వెనుక.. ముంబై 26/11 దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌‌ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్లు ఇండియన్ నిఘా సంస్థలు ఆరోపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్​లో హిందువుల రక్తం పారిస్తామంటూ ఇటీవల హఫీజ్ కామెంట్లు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హఫీజ్ నేతృత్వంలోనే పహల్గాంలో టెర్రరిస్టులు మారణహోమం సృష్టించారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కాశ్మీర్​లో చాలా రోజులుగా లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యాక్టివ్​గా ఉన్నది. లష్కరే తోయిబాకు చీఫ్​గా హఫీజ్​ ఉంటే.. డిప్యూటీ హెడ్‌‌గా సైఫుల్లా (హిజ్బుల్‌‌ ముహజిదిన్‌‌) వ్యవహరిస్తున్నారు.

 సోనామార్గ్, బూటాపత్రి, గందర్బాల్ వంటి హైప్రొఫైల్ టెర్రరిస్ట్ అటాక్స్​లో హఫీజ్ హస్తం ఉన్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. 2‌‌‌‌024, అక్టోబర్ లో బూటాపత్రిలో ట్రెరరిస్టులు నలుగురిని కాల్చి చంపేశారు. వీరిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ఉన్నారు. అదే నెలలో సోనామార్గ్​లో ఆరుగురు టన్నెల్ కన్​స్ట్రక్షన్ వర్కర్స్, ఓ డాక్టర్​ను టెర్రరిస్టులు చంపారు. వీటి వెనుక హఫీజ్ సయీద్​తో పాటు తాజాగా పహల్గాంలో దాడి చేసిన ప్రధాన నిందితుడు హషీం మూసా హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే, సోనామార్గ్‌‌ ఘటన తర్వాత.. ఎల్‌‌ఈటీ ఏ ప్లస్ కేటగిరీ టెర్రరిస్ట్ జునైద్‌‌ అహ్మద్‌‌ భట్‌‌ను డిసెంబర్‌‌లో దాచిగామ్‌‌ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి.

 కాగా, హఫీజ్ సయీద్ ఆదేశాల మేరకే పహల్గాంలో దాడి జరిగినట్లు తెలుస్తున్నది. దాడిలో ఉపయోగించిన ఆయుధాలు, కాల్చిన విధానాన్ని బట్టి చూస్తే గతంలో లష్కరే తోయిబా అటాక్స్​తో సమానంగా ఉన్నాయి. హఫీజ్ సయీద్ యూఎన్ గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో ఉన్నాడు. అమెరికా అతనిపై రూ.85 కోట్ల రివార్డు ప్రకటించింది. పాకిస్థాన్ మాత్రం ఇండియన్ నిఘా వర్గాల ఆరోపణలను ఖండిస్తున్నది. సయీద్ పాకిస్థాన్​లో లేడని, ఆరోపణలు ఆధారరహితమని అంటున్నది.