ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పుడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా, పోలింగ్ జరిగిన మరుసటి రోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలు కలకలం రేపాయి. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ప్రస్తుతం శరవేగంగా దర్యాప్తు చేస్తోంది సిట్ బృందం. ఈ క్రమంలో ఈసీకి ఇంటెలిజన్స్ నుండి బిగ్ అలర్ట్ వచ్చింది. పిఠాపురంలో కౌంటింగ్ కి ముందు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది ఇంటెలిజన్స్.
కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజన్స్ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కాకినాడలోని ఏటిమొగ్గ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అల్లర్లకు కారణమైన వారిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. కౌంటింగ్ నాడు అల్లర్లు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.