- ఐదుగురిని అరెస్టు చేసిన మధ్యప్రదేశ్ ఏటీఎస్
- హిందూ పేర్లు పెట్టుకొని పలు చోట్ల ఉద్యోగాలు
- దేశవ్యాప్తంగా విధ్వంసాలకు హిజ్బ్ ఉత్ తహ్రీర్ కుట్ర
- పరారీలో మరో సానుభూతిపరుడు
- ఎయిర్‌గన్, పెల్లెట్స్, జిహాదీ సాహిత్యం స్వాధీనం
- ఓల్డ్ సిటీ, గోల్కొండ, హబీబ్‌నగర్, జగద్గిరిగుట్టలో సోదాలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో టెర్రరిస్టు సంస్థల కదలికలు మరోసారి బయటపడ్టాయి. టెర్రరిస్టు సానుభూతిపరులను మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) మంగళవారం అరెస్టు చేసింది. ఐదుగురిని అరెస్టు చేసి భోపాల్‌కు తరలించింది. వారు హిందువుల పేర్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సోదాల్లో ఎయిర్ గన్, పెల్లెట్స్, జిహాదీ సాహిత్యం, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ‘హిజ్బ్ ఉత్ తహ్రీర్’ దేశవ్యాప్తంగా విధ్వంసాలకు ప్లాన్ చేసింది. ఈ కుట్రను గుర్తించిన కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్రంగా టెర్రరిస్టు సానుభూతిపరులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు సేకరించాయి.
దీంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులకు సమాచారమిచ్చాయి. దీంతో భోపాల్‌లో హిజ్బ్ ఉత్ తహ్రీర్ కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఆ రాష్ట్ర ఏటీఎస్.. స్థానిక ఎన్‌జీఓకు చెందిన మహ్మద్ వసీంను అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం 20 మంది హిజ్బ్ ఉత్ తహ్రీర్ సానుభూతిపరులను గుర్తించి, వారిలో 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించింది. విచారణలో హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు గుర్తించింది. హిందువుల పేర్లతో కొంతమంది హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లు ఆధారాలు సేకరించింది. దీంతో రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్.. పోలీసులతో కలిసి 3 రోజుల పాటు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించింది. ప్రధానంగా ఓల్డ్ సిటీ, గోల్కొండ, హబీబ్ నగర్, జగద్గిరిగుట్ట, షామీర్‌పేట్, నాంపల్లి, సికింద్రాబాద్, మల్లేపల్లిలో సోదాలు చేసింది.
స్టూడెంట్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, అడ్డాకూలీలు టార్గెట్
ఒడిశాకు చెందిన అబ్దుల్ రహమాన్ (33) దేవీప్రసాద్ పాండ్య పేరుతో చెలామణి అవుతున్నాడు. హైదరాబాద్‌లోని గోల్కొండలో నివాసం ఉంటున్న అతను ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మహ్మద్ సలీంతో కలిసి మధ్యప్రదేశ్‌కు వెళ్లి వచ్చాడు. వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, రోజువారి కూలీలను టార్గెట్ చేసుకుని వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించారు. దేశంలో షరియా చట్టాలను తీసుకురావడానికి అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేశారు. గోల్కొండలోని బడాబజార్‌కు చెందిన డెంటిస్ట్ షేక్ జునైద్ (32)ను కూడా టెర్రరిజం వైపు మళ్లించారు. సలీం, అబ్దుల్, జునైద్ కలిసి హైదరాబాద్‌లోని ముస్లిం యువతను ట్రాప్ చేసేందుకు ప్లాన్ వేశారు. అందులో భాగంగా హబీబ్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ అబ్బాస్ అలియాస్ బస్క వేణుకుమార్(36), రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్ట మఖ్దూం నగర్‌కు చెందిన రోజువారి కూలీలు మహ్మద్ హమీద్ (32), మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ (27)తో కలిసి హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులు మహ్మద్ సలీం, అబ్దుల్ రహమాన్, షేక్ జునైద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ హమీద్‌లను అరెస్టు చేశారు. మహ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నాడు. ఐదుగురిని భోపాల్ కు తరలించారు.
అత్యంత భయంకరమైనది హిజ్బ్ ఉత్ తహ్రీర్
హిజ్బ్ ఉత్ తహ్రీర్ ఐసిస్ కన్నా భయంకరమైనది. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. రసాయనాలతో దాడులు చేయడం, ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో విధ్వంసాలకు పాల్పడడంపై ఈ టెర్రర్ సంస్థ శిక్షణ ఇస్తుంటుంది. గ్లోబల్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ సంస్థ మూలాలను గుర్తించి సంబంధిత దేశాలను అప్రమత్తం చేస్తుంటాయి.
హిందువుల పేర్లతో హై ప్రొఫైల్ ఉద్యోగాలు
భోపాల్‌కు చెందిన మహ్మద్ సలీం (41) హైదరాబాద్ గోల్కొండలోని బడా బజార్ మోతీమహల్‌లో నివాసం ఉంటూ, ఓ మెడికల్ కాలేజీలో సౌరభ్ రాజ్ వైద్య పేరుతో ఉద్యోగం చేస్తున్నాడు. సలీంకు హిజ్బ్ ఉత్ తహ్రీర్‌తో సంబంధాలు ఉన్నాయి. ఈ సంస్థకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలు, ఐసిస్ సహా మొత్తం 50 దేశాలతో లింకులు ఉన్నాయి. ఈ క్రమంలోనే సలీం దేశవ్యాప్తంగా యువతకు ఇస్లామిక్ సాహిత్యం నేర్పిస్తూ టెర్రరిజం వైపు ప్రేరేపిస్తున్నాడు.