- గ్రూప్–1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్ఫెయిల్
- ఉన్నతాధికారులపర్యవేక్షణా లోపం,సిబ్బంది నిర్లక్ష్యం
- ఆందోళనలు, విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ
- క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్, ఎస్‌బీ సిబ్బంది
- సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
- లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు చూస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోయినట్టు కనిపిస్తున్నది. గ్రూప్–1 ఆందోళనల నుంచి లగచర్ల ఘటన దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టు స్పష్టమవుతున్నది. ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
ఆందోళనలు, విధ్వంసాలను ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 3 నెలలుగా ఉద్రికత్త పరిస్థితులు ఉన్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించలేదు.దీంతో గ్రూప్ –1 అభ్యర్థులు, టీజీఎస్పీ కానిస్టేబుల్స్ ఆందోళనలు సహా వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను ముందుగానే గుర్తించడంలో ఇంటెలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులు విఫలమయ్యారు.
వీటినే బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి, అంతర్గత లోపాలను గుర్తిస్తున్నది. ప్రజాభిప్రాయ సేకరణసహా భూసేకరణకు వచ్చే అధికారులపై దాడులు చేయాలనే కుట్రలను కూడా పసిగట్టలేకపోవడంపై సమగ్ర విచారణ జరుపుతున్నది.
ఫార్మాకు గెజిట్ విడుదలైన నాటి నుంచి బీఆర్‌ఎస్ స్కెచ్
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్, పులిచర్ల తండ, రోటిబండ తండాలో ఫార్మా కంపెనీ, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆగస్టు 1న వికారాబాద్ జిల్లా కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు. ఈ గ్రామాల పరిధిలో 1,314 ఎకరాల భూసేకరణ చేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాదయాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 9న బీఆర్‌ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డితో కలిసి పాదయాత్ర నిర్వహించేందుకు రెడీ అయ్యారు. పోలీసులు వారిని అడ్డుకొని పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్టోబర్ 25న లగచర్లలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు దుద్యాల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శేఖర్‌పై దాడి జరిగింది. అనంతరం ఎలాగైనా ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు ప్లాన్ వేశారు.
కలెక్టర్‌నైనా తరిమికొట్టి..
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గత నెల 27న రోటిబండ తండకు వచ్చారు. భూసేకరణను అడ్డుకోవాలని అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. ఇందులో భాగంగా ఆయన అనుచరుడు సురేశ్‌తో సహా మరికొంత మందితో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ విషయంలో స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు అంచనావేయలేక పోయారు.
విధ్వంసాల కుట్రకు సంబంధించి సమాచారం సేకరించడంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయి. సాధారణంగా సీఎం నియోజకవర్గంలో హై సెక్యూరిటీ ఉంటుంది. మారుమూల గ్రామాల్లో చిన్న ఘటన జరిగినా స్థానిక పోలీసులకు క్షణాల్లో తెలిసిపోవాలి. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల పొలిటికల్ ఇంటెలిజెన్స్ సహా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తూ ఉండాలి.
స్థానిక ఇంటెలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అలర్ట్‌గా లేకపోవడం వల్లే లగచర్ల, రోటిబండ తండా ఘటనలు చోటుచేసుకున్నట్టు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం.
గ్రూప్–1, టీజీఎస్పీ, హోంగార్డ్స్ ఆందోళనలను గుర్తించడంలోనూ..
లగచర్ల ఘటన కు ముందు జరిగిన గ్రూప్– 1 అభ్యర్థుల ఆందోళనలు, టీజీఎస్పీ పోలీసుల తిరుగుబాటు చర్యలను ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించలేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో నిఘా వైఫల్యం స్పష్టంగా ఉన్నట్టు గుర్తించారు. గ్రూప్–-1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత నెల రెండో వారంలో అర్ధరాత్రి ఆందోళన చేశారు. రోడ్లపై బైఠాయించారు.
సెక్రటేరియెట్‌ను ముట్టడిస్తారని తెలుసుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి, చెదరగొట్టారు. వన్ స్టేట్– వన్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్లెక్కి నిరసన తెలిపారు. కుటుంబాలతో సహా వచ్చి సెక్రటేరియెట్‌ను ముట్టడించారు. ఈ క్రమంలోనే హోంగార్డులు ఆందోళనకు దిగారు. కుటుంబాలతో కలిసి సెక్రటేరియెట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీటికి సంబంధించిన ముందుస్తు సమాచారం సేకరించడంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విఫలం అయ్యారని విమర్శలు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో నిఘా కరువు
ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆందోళలకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ గుర్తించడంలో స్థానిక పోలీసులు అలసత్వం వహించినట్టు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఇంటెలిజెన్స్, ఎస్‌బీ సిబ్బంది ప్రభావిత గ్రామాల్లో పర్యటించకపోవడం వల్ల దాడులకు సంబంధించిన ముందస్తు సమాచారం సేకరించలేక పోయారని తెలిసింది.
గ్రామీణస్థాయిలో లోకల్ బీఆర్ఎస్ లీడర్లు, ప్రజాసంఘాలు, పాత నేరస్తులు, పట్నం నరేందర్‌రెడ్డి అనుచరుడు సురేశ్ సహా ఇతర కార్యకర్తలపై పటిష్ట నిఘా పెట్టలేదని సమాచారం. లగచర్ల సమీపంలో ఈ నెల 11న తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో దాడులకు కుట్ర చేసిన సంగతి కూడా నిఘా వర్గాలు గుర్తించలేదని తెలిసింది.
లగచర్లకు సమీపంలోని పొలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఉండగా అక్కడే దాదాపు 200 మంది పోలీసులను మోహరించారు. కానీ లగచర్లలో కొందరు గుమికూడడం, అధికారులపై దాడులు చేసేందుకు కర్రలు, రాళ్లు సిద్ధం చేసుకోవడానికి సంబంధించి కనీస సమాచారం కూడా సేకరించలేకపోయారు.
దాడులకు సంబంధించిన సమాచారం లేకపోవడంతోనే కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల గ్రామంలోకి వెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఆందోళనకారులు కలెక్టర్‌పై దాడి చేసి, కార్లను ధ్వంసం చేశారు. స్థానికంగా విధ్వంసం సృష్టించారు.