- డ్రోన్ సాయంతో గ్రామాల శివార్లలో సెర్చ్ ఆపరేషన్
- మొక్కజొన్న చేనులో పులి పిల్ల కనిపించినట్లు ప్రచారం
నల్లబెల్లి, వెలుగు : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం, నారక్కపేట, నాగరాజుపల్లి, మామిండ్ల వీరయ్యపల్లి, కొండాపురం గ్రామాల్లో ఐదు రోజులుగా పెద్దపులి సంచారంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆయా గ్రామాల్లో సోమవారం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పర్యటించి, రైతులతో మాట్లాడారు. డ్రోన్ కెమెరాలతో పులి జాడ కనుక్కోవాలని ఆఫీసర్లను కోరారు.
దీంతో నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ డ్రోన్ కెమెరాతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇదిలా ఉండగా శనిగరం బోయినికుంట సమీపంలోని మొక్కజొన్న చేనులో పులి పిల్ల కనిపించిందని రైతులు పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ గోవర్ధన్ ఘటనాస్థలానికి చేరుకొని పులి పిల్ల జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రజలంతా ఇండ్లకు చేరుకోవాలని సూచించారు.