కొత్తగూడెం భగ్గుమంటోంది : ఓపెన్​కాస్ట్​ గనుల్లో 47 డిగ్రీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం భగ భగ మండుతోంది. రోహిణి కార్తెకు ముందే రోకళ్లు పగి లేంత ఎండలు కొడుతున్నాయి. దీంతో   జిల్లా వాసులు అల్లాడుతున్నారు.  పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, అప్రకటిత కరెంట్​ కోతలతో జనం ఇబ్బంది పడుతున్నారు. కొత్తగూడెంలో అధికారికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఇతరత్రా సాధానాల ద్వారా ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదైనట్టుగా పలువురు పేర్కొంటున్నారు.

ఇక ఓపెన్​కాస్ట్​ మైన్స్​లలో 47 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా రోహిణి కార్తెలో 44 డిగ్రీల దాకా  ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. కాగా రోహిణికి వారం రోజుల ముందే 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ఎండలతో జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ, లారీ, ఆటోల డ్రైవర్లు  భానుడి భగభగలతో అల్లాడుతున్నారు. వేడి గాలులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.

చిరు వ్యాపారులు మండు టెండల్లో అవస్థలు పడ్తున్నారు. కొత్తగూడెం పట్టణంలో మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసిన చలి వేంద్రాల్లో మంచినీరు మాయమైంది. ఎండా కాలం ముగిసే వరకు చలివేంద్రా లు  కొనసాగించాలని  కలెక్టర్​ ఆదేశించినా మున్సిపల్​ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పాలకులు పట్టించుకోని దుస్థితి. దీంతో ప్రజలు దాహం తీర్చుకునేందుకు వాటర్​ బాటిళ్లను కొనుక్కోవాల్సి వస్తోంది. మండుతున్న ఎండలతో తాటి ముంజలు, చెరకు రసం, శీతల పానీయాలకు డిమాండ్​ పెరిగింది.