విలీన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సమీపంలోని ఎటపాక(ప్రస్తుతం ఏపీలో విలీన గ్రామం)లో నిర్మించిన రామాయణం థీమ్ పార్క్​లో కొందరు స్థానికులు గుడిసెలు వేసుకునేందుకు సోమవారం ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న భద్రాచలం దేవస్థాన ఈవో శివాజీ.. తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈక్రమంలో దేవస్థానం స్టాఫ్​కు, ఆక్రమణదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఈవో శివాజీ, ఎటపాక మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్సై పార్క్ వద్దకు చేరుకున్నారు.

ఆక్రమణదారులను చెదరగొట్టారు. కాగా, ఉమ్మడి ఏపీలో అప్పటి టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ 15 ఎకరాల్లో రామాయణం థీమ్ పార్క్ నిర్మించింది. విభజన అనంతరం అది విలీన గ్రామంలోకి వెళ్లిపోయింది. ఇటీవల ఆంధ్రాకు చెందిన కొందరు నేతలు థీమ్ పార్క్ భూముల్లో పక్కా భవనాలు కడుతుండగా.. దేవస్థానం స్టాఫ్ అడ్డుకుని, ఆ తర్వాత వదిలేశారు. దీంతో తాము సైతం గుడిసెలు వేసుకుంటామని కొంతమంది స్థానికులు థీమ్ పార్క్ భూముల్లోకి చొరబడ్డారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య చర్చలు నడుస్తున్నాయి.