సైబర్ యుద్ధాలు
సైబర్ వార్‌పై అన్ని దేశాల ఫోకస్
చాలా దేశాలపై చైనా ఎటాక్స్
యుద్ధం తీరు మారుతోంది. గన్స్, మిసైల్స్, బాంబుల ప్రయోగం కాదు.. ఇప్పుడు దేశాల మధ్య వార్ జోన్‌గా ఇంటర్నెట్ మారిపోతోంది. అమెరికా, రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్ వంటి దేశాలు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా సైబర్ స్పేస్ లోనే శత్రుదేశాలపై దాడులకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కొన్నేండ్ల కిందటి వరకూ సైబర్ స్పేస్ ను బాగా వాడుకుని, అమెరికా సహా అనేక దేశాల గుట్టుమట్లను తెలుసుకోవడంలో రష్యా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. కానీ ఇటీవల చైనా సైబర్ వార్ లో అన్ని దేశాలను తలదన్నే స్థాయిలో ముందుకొచ్చేసింది. ఎక్కువ పరిధి ఉండటం, తక్కువ ఖర్చు కావడం, ఎవరు చేశారో తెలియకపోవడం, దీటుగా బదులు చెప్పడం అంత సులభం కాకపోవడంతో సైబర్ వార్కే చాలా దేశాలు సై అంటున్నాయి. అందుకే సైబర్ వార్ ను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు తమ తమ స్ట్రాటజీలకు పదును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రక్తపాతం, ప్రాణనష్టంతో శత్రుదేశాలకు కలిగించే లాస్ కన్నా.. సైబర్ వార్ తో ఇంకెన్నో రెట్లు ఎక్కువగా దెబ్బకొట్టొచ్చు. కొన్నేండ్ల కిందటి వరకూ రష్యా ఇందులో ఆరితేరింది. ఇప్పుడు రష్యాను తలదన్నే స్థాయిలో చైనా ప్రపంచ దేశాలపై సైబర్ వార్ కు పాల్పడుతోంది. ఇంటర్నెట్ ను ఆయుధంగా చేసుకుని శత్రుదేశాలపై నిఘా వేయడం దగ్గర నుంచి ఎన్నో రకాలుగా ఎటాక్‌లు చేస్తోంది. మిలిటరీ మొదలుకుని ఫైనాన్షియల్, కల్చరల్, పొలిటికల్, సోషల్గానూ సైబర్ దాడులకు దిగుతోంది. కొద్ది వారాల క్రితం.. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. చైనా ప్రభుత్వంతో లింకులున్న ఆ దేశానికి చెందిన ఓ టెక్నాలజీ కంపెనీ ఇండియన్లపైనా, ఇండియన్ కంపెనీలు, ఆర్గనైజేషన్లపైనా కన్నేసినట్టుగా గుర్తించింది. దీనిపై మానిటర్ చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
అన్ని దేశాలకూ ముప్పే
ఇలాంటి సైబర్ ఎటాక్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశం ఇండియా మాత్రమే కాదు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కూడా గత వారం ఇన్ఫర్మేషన్ను దొంగిలించే స్లాత్ఫుల్ మీడియా మాల్వేర్ను గుర్తించింది. దీని ద్వారా ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మలేషియా, రష్యా, ఉక్రెయిన్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే ఈ మాల్వేర్ను ఎవరు క్రియేట్ చేశారు.. ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనే విషయాలను మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ గుర్తించలేకపోయింది. కానీ చాలా ఏండ్లుగా, సైబర్ వార్ ఫేర్‌కు సంబంధించి చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్‌లపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనికి ఉదాహరణగా 2016 అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లనే చెప్పవచ్చు. అప్పట్లో రష్యన్ బాట్స్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేసినట్లు ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. వచ్చే నెలలో జరగనున్న అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లకు సంబంధించి కూడా సైబర్ ఎటాక్స్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
సైబర్ వార్ ఫేర్ అంటే?
సైబర్ వార్ఫేర్ అనేది సైబర్‌స్పేస్‌లో ప్రత్యర్థుల మధ్య జరిగే వ్యూహాత్మక పోరాటం. పెద్ద సంఖ్యలో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఇది దేశాలకు ఉపయోగపడుతుంది. ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది. తక్కువ ఖర్చుతో చేయవచ్చు. ఎవరు చేస్తున్నారో తెలిసే అవకాశమే ఉండదు. సైబర్ వార్ఫేర్ గురించి అర్థం చేసుకోవడానికి ఈ మూడు లక్షణాలు చాలా కీలకమైనవి. గత రెండు దశాబ్దాలుగా సైబర్ వార్ ఫేర్ లో చాలా మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ అనేది నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయింది. దానిపై ఎక్కువగా ఆధారపడే ఏ దేశానికైనా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఐపీ దొంగతనం, చిన్న వ్యాపారాలు, ఎన్నికలు, విద్యుత్ గ్రిడ్ వరకు ఇలా అన్నీ కూడా సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. సైబర్ వార్ఫేర్ లో ట్రైనింగ్‌కు సంబంధించి ఇంటర్నెట్లోనే బోలెడు వీడియోలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కొందరిని గుర్తించి వారికి మోటివేషన్ ఇవ్వడం. బడ్జెట్లో ల్యాప్ టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎటాక్ చేయొచ్చు.
అడ్డుకోవడం సవాలే..
మనం సైబర్ వార్ ఫేర్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధం కావాలి. అయితే వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేది ప్రభుత్వాలకు సవాలే. అయితే ప్రభుత్వాలకు వేరే చాయిస్ ఉండదు. వాటిని ఎదుర్కోవడం తప్పదు. వీటిని ఎదుర్కొనేందుకు గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్ల మధ్య రిలేషన్షిప్ పెరగాలని యూఎస్ లోని కమిషన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ సూచించింది. అలాగే సైబర్ సెక్టార్లో టెక్నాలజీ, సైన్స్, రీసెర్చ్, డెవలప్మెంట్కు సంబంధించి ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీల ద్వారా ఆటోమెటిక్‌గా సైబర్ ఎటాక్స్‌ను గుర్తించడం, అలాగే సైబర్ ఎటాక్స్‌ను లాంచ్ చేయడానికి అమెరికా భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇక మన దేశం విషయానికి వస్తే.. గత ఏడాది డిఫెన్స్ సైబర్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సైబర్ వార్ ఫేర్ అనేది సంస్థాగతంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఎంతో ముప్పును కలిగిస్తోంది. దీనిని కౌంటర్ చేయడానికి ప్రభుత్వపరంగా పటిష్టమైన స్ట్రాటజీని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎటాక్ ఎక్కడి నుంచి జరిగిందో గుర్తించలేం
సైబర్ వార్ ఫేర్ ఎక్కడి నుంచి నడుస్తోందో గుర్తించడం చాలా కష్టం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2010లో స్టక్స్నెట్ సైబర్ ఎటాక్. ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీని దెబ్బతీయడానికి ఈ దాడులకు పాల్పడ్డారు. అప్పట్లో ప్రభుత్వం, ఇరాన్ సైంటిస్టులు ఇంటర్నల్‌గా సమస్యలు ఉన్నాయని భావించారు. ఇది తెలివైన, అధునాతనమైన దాడి. యూఎస్–ఇజ్రాయెల్ కలిసి స్టక్స్ నెట్ఎటాక్ చేసినట్టుగా భావిస్తుంటారు. కోవర్ట్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల కోసం మాల్వేర్ను ప్రభుత్వాలు వాడవచ్చని ఇది నిరూపించింది. ప్రభుత్వాలే కాదు వ్యక్తులు కూడా ఇలాంటి దాడులకు పాల్పడవచ్చు. వారిని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తే చాలు. మాల్ వేర్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. గుర్తించడం చాలా కష్టం. ఉదాహరణకు చైనాలో ఎన్నో మాల్వేర్లు డిజైన్ చేయబడుతున్నాయి. అంతే కాదు.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనీస్ యూనివర్సిటీలు కలిసి హ్యాకర్లకు ట్రైనింగ్ ఇస్తున్నాయి.
సైబర్ వార్‌లో ఈ ఐదే కీలకం
సైబర్ వార్ఫేర్ అనేది చాలా విస్తృతమైనది. ఇది ఐదు విభిన్న అంశాలను బేస్ చేసుకుని జరుగుతుంది. అవే ఎకనామిక్, సోషల్, కల్చరల్/ఇంటెలెక్చువల్, మిలిటరీ, పొలిటికల్.
ఇక రెండోది సామాజికంగా ఎఫెక్ట్ చూపించడం. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం కూడా సైబర్ వార్ ఫేరే. ఈ ఫీల్డ్‌లో రష్యా ఎక్స్పర్ట్. కానీ ప్రస్తుతం చైనా కూడా ఈ గేమ్‌లో దూసుకువెళుతోంది.
ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్(ఐపీఆర్) కూడా స్ట్రాటజిక్ కాంపిటీషన్లో మరో అంశం. 2014లో ఐదుగురు చైనీస్ మిలిటరీ హ్యాకర్లు.. యూఎస్ స్టీల్, జేపీ మోర్గాన్, ఆర్కోవా, వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రికల్ కంపెనీ, సోలార్ వరల్డ్, యునైటెడ్ స్టీల్ వర్కర్స్కు సంబంధించిన రహస్యాలను దొంగిలించారని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఆరోపించింది.
సైబర్ వార్ ఫేర్ లో అత్యంత కీలకమైనవి మిలిటరీ సైబర్ ఎటాక్స్. రష్యా ఇంటెలిజెన్స్‌కు చెందిన ‘‘శాండ్‌వార్మ్ టీమ్”అనే గ్రూపు అమెరికా, ఉక్రెయిన్, పోలండ్, ఇతర యూరోపియన్ యూనియన్ కంట్రీలు, నాటోలోని ప్రభుత్వ సెక్టార్లను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తోంది.
ఎకనామికల్‌గా చూస్తే అమెరికాలో 85 శాతం సైబర్ ఎటాక్స్ టార్గెట్ చేసేవి ప్రైవేట్ సెక్టార్ నే. అందులోనూ ఎక్కువగా చిన్న చిన్న బ్యాంకులే ఉంటాయి. వీటిపై రోజుకు పది వేలకుపైగా దాడులు జరుగుతుంటాయి. నార్త్ కొరియాకు చెందిన హ్యాకింగ్ గ్రూపు బీగిల్ బాయ్జ్.. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని బ్యాంకులను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉందని అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలు ఇటీవల హెచ్చరించాయి.
For More News..