వేసవిలో నీటి సమస్య తీర్చాలి

భూమిపై ప్రతి జీవి బ్రతకడానికి ప్రాథమిక అవసరం నీరే. కాని ప్రతి  ఏటా వేసవికాలం సమీపించడంతో ఎండల తీవ్రత  పెరిగి  భూగర్భజలాలు అడుగంటుతాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటాయని వాతావరణ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నీటి ఎద్దడి సమస్య గ్రామాలలో మరియు పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రతరం అవుతుంది. వేసవిలో ఉష్ణోగ్రత అధికమవడంతో  ప్రజలకు నీరందించే బావులు మరియు బోర్లలో నీరు అడుగంటి గ్రామాలలో, పట్టణాలలో నీటి సరఫరా స్తంభించి త్రాగునీరు మరియు మానవ కార్యకలాపాలకు సరిపడా నీరందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీటిని  అందివ్వడానికి  ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్, రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టినది. కానీ ఆశించిన స్థాయిలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు లభించడం లేదు. మహిళలు మంచినీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాలలో నీటిని ట్యాంకర్ల ద్వారా  కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో మహిళలు తాగునీటి కోసం మండల కేంద్ర ఆఫీసుల, పంచాయతీ ఆఫీస్ మరియు రోడ్ల వద్ద బిందెలతో ఆందోళన చేసిన సంఘటనలు ఎదురవుతున్నాయి. ఏటా తాత్కాలిక చర్యలతో ఉపశమనాన్ని కలిగిస్తున్న అధికారులు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోకపోవడంపై నీటి సమస్య ప్రతిసారీ ఎదురు కావడం జరుగుతుంది.

ఈ ఏడాది ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వాలు ప్రజల అవసరాలు పట్టించుకోక రాజకీయంగా ఎలా ముందుకెళ్లడమనే అంశంపైనే దృష్టి సారిస్తున్నారు. వీటికన్నా ముఖ్యం కాలా నుగుణంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలానే విషయాన్ని పాలకులు గుర్తెరగాలి. గ్రామీణ మరియు పట్టణ తాగునీటి సమస్యను నుండి కాపాడడానికి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో తక్షణం స్పందించి తాగునీటి సమస్యలను పరిష్కరించాల్సిన  అవసరం ఉంది.


- సంపతి రమేష్ మహారాజ్,
రాజన్న సిరిసిల్ల జిల్లా