పాకెట్ మనీ కోసం ప్రచారానికి స్టూడెంట్స్.. ఒక్కొక్కరికి రూ.400

పాకెట్ మనీ కోసం ప్రచారానికి స్టూడెంట్స్.. ఒక్కొక్కరికి రూ.400

ఎన్నికలు ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తాయి. రెండు నెలలుగా కళాకారులు,  అడ్డా కూలీలు, బస్తీలలోని మహిళలు, యువకులు ప్రచారంలో పాల్గొంటూ ఉపాధి పొందుతున్నారు. వీరితో పాటు ఇంటర్, డిగ్రీ చదివే స్టూడెంట్స్ సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. గర్ల్స్, బాయ్స్ అనే తేడా లేకుండా  పాకెట్ మనీ సంపాదించుకుంటున్నారు. ఏ గల్లీలో చూసినా.. పాంప్లేట్లు, స్టికర్లు చేతిలో పట్టుకొని దర్శనం ఇస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు.

కాలేజీలు, హాస్టళ్ల నుంచి...

సిటీలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ కొందరు గ్రూపులుగా ఏర్పడుతున్నారు. వీరికి ఓ టీమ్ లీడర్ ఉంటారు. వారికి వివిధ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులతో పరిచయాలు ఉంటాయి. ఆయా పార్టీల యూత్ వింగ్ సభ్యులు ప్రచారం కోసం వీరిని  కాంటాక్ట్ అవుతున్నారు.  ప్రచారంలో పాల్గొన్న ఒక్కో స్టూడెంట్ కు మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు, రోజుకు రూ.400 వరకు ఇస్తున్నారు. మరికొందరు ఆయా పార్టీలకు చెందిన యూత్ వింగ్ సంఘాలకు కాలేజీ  స్టూడెంట్లను తీసుకెళ్లి.. తమ సంఘ సభ్యులుగా చెప్పుకుంటూ ప్రచారం చేయిస్తున్నారు.  స్టూడెంట్లను ప్రధానంగా అభ్యర్థుల ఫ్యామిలీ మెంబర్లు పాల్గొంటున్న ప్రచారాలకు తీసుకెళుతున్నారు. కొన్నిచోట్ల ప్రతీ ఫ్యామిలీ మెంబర్ల వెనకాల  పదిమందికి పైగా స్టూడెంట్స్ పాల్గొంటున్నారు.  అయితే, వీరిలో చాలా మందికి ఓటు హక్కు లేకపోవడం గమనార్హం. వీరే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సిటీకి చదువుకోవడానికి, కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వడానికి వచ్చి హాస్టళ్లలో ఉంటున్న యూత్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏండ్లనుంచి ప్రిపేర్ అవుతున్నా నోటిఫికేషన్లు రావట్లేదని, హాస్టల్ ఫీజులు చెల్లించడానికి తల్లిదండ్రులను అడగలేక ఇలా ప్రచారంలో పాల్గొనక తప్పట్లేదని చెబుతున్నారు.

పేరెంట్స్​ను డబ్బు అడగటం ఇష్టంలేక ప్రచారానికి..

కాలేజీలకు డుమ్మా కొట్టి ప్రచారంలో పాల్గొనడం అవసరమా.. అని కొందరు స్టూడెంట్లను అడగగా, కాలేజీల ఫీజులు కట్టడానికే పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారని చెబుతున్నారు. పాకెట్ మనీ, ఇతర అవసరాల కోసం పేరెంట్స్​ను అడగటం ఇష్టం లేక ఇలా ప్రచారానికి వచ్చామంటున్నారు.  మరికొందరు స్టూడెంట్స్ పాకెట్ మనీ కోసం రెగ్యులర్​గా మార్నింగ్ పేపర్ వేస్తామని, కాలేజ్ అయ్యాక క్యాటరింగ్స్, ఇతర పనులు చేసుకుంటామని చెబుతున్నారు. ఇది కూడా అలాగే అంటున్నారు. స్టడీస్​ను నెగ్లెక్ట్ చేయడం లేదని, ఖాళీ సమయాల్లోనే ఇతర పనులు చేసుకుంటామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు  కాలేజీలకు డుమ్మా కొట్టక తప్పట్లేదంటున్నారు.

ఫేస్  మాస్క్ పెట్టుకొని ప్రచారం చేస్తున్నాం..

మా పేరెంట్స్ ఇప్పటికే నన్ను కష్టపడి చదివిస్తున్నారు. చిన్న చిన్న అవసరాల కోసం ఇంట్లో వాళ్లను అడగలేను. అందుకే ఇలా ప్రచారానికి వచ్చా. కొన్ని ఏరియాల్లో మా రిలెటీవ్స్, తెలిసిన వాళ్లు ఉంటారు. వారి కంటపడకుండా, గుర్తుపట్టకుండా మొహానికి మాస్కు పెట్టుకొని ప్రచారంలో పాల్గొంటున్నాం. 

ALSO READ : ఫామ్​హౌస్​ సీఎం మనకెందుకు? .. ప్రజలు గోసపడ్తున్నా కేసీఆర్​కు పట్టదు: మల్లికార్జున ఖర్గే


- ప్రవల్లిక, డిగ్రీ స్టూడెంట్.

హాస్టల్ ఫీజు కోసం..

అశోక్​ నగర్​లో​ హాస్టల్లోఉంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్​కు  ప్రిపేర్ అవుతున్నా. రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్​ ఆగిపోయాయి. మరికొన్ని నోటిఫికేషన్లు కూడా రిలీజ్ కాలేదు. జాబ్ లేకుండా ఊరికి వెళ్లలేను. ఇంట్లో వాళ్లను హాస్టల్ ఫీజుల కోసం డబ్బులు అడగలేను. ప్రచారానికి వెళితే కనీసం హాస్టల్ ఫీజయినా చెల్లించుకంట.
- అరుణ్ కుమార్, అశోక్ నగర్.