
- అదంతా ఫేక్ ప్రచారం: ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో తెలుగుకు బదులు సంస్కృతం సబ్జెక్టును ప్రవేశపెడ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, ఇంటర్ ఆర్జేడీ జయప్రదబాయి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ(హెచ్సీయూ)కి చెందిన పలువురు తెలుగు ప్రొఫెసర్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యను కలిశారు. సర్కారు కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజీగా తెలుగును కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హెచ్సీయూ తెలుగు హెచ్ఓడీ పిల్లలమర్రి రాములు, మాజీ హెచ్ఓడీ దార్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కోట్లాదిమంది ప్రజల మాతృభాషగా ఉన్న తెలుగు నిత్య వ్యవహారంలో ఒక భాగమని తెలిపారు.
ఇతర సబ్జెక్టుల మాదిరిగానే తెలుగు కూడా విజ్ఞానాన్ని అందించే ఒక సబ్జెక్టు అని, అలాంటి తెలుగును నిర్వీర్యం చేసే చర్యలు సరికావని చెప్పారు. కృష్ణ ఆదిత్య, జయప్రదబాయి మాట్లాడుతూ... టీజీపీఎస్సీ ద్వారా పది సంస్కృతం పోస్టులను భర్తీ చేయడం కోసం ఏఏ కాలేజీల్లో ఖాళీలున్నాయనే దానిపై సమాచారం మాత్రమే బోర్టు అడిగినట్టు చెప్పారు. అంతేగానీ తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం ప్రోత్సహించే ఉద్దేశమే లేదన్నారు. ఇటీవల జరిగిన రిక్రూట్మెంట్ లో 60 తెలుగు పోస్టులను భర్తీ చేసినట్టు గుర్తుచేశారు. అధికారులను కలిసిన వారిలో తెలుగు ప్రొఫెసర్లు ఎం.గోనానాయక్, త్రివేణి వంగరి, భూక్య తిరుపతి తదితరులు ఉన్నారు.