ఇంటర్ బోర్డు సెక్రటరీగా కృష్ణ ఆదిత్య బాధ్యతలు

ఇంటర్ బోర్డు సెక్రటరీగా కృష్ణ ఆదిత్య బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. మూడేండ్లుగా పరీక్షల ఫలితాల్లో రిపీడెట్ గా వస్తున్న తప్పుల డేటాను ఇవ్వాలని కోరారు. బుధవారం ఆయన ఇంటర్ బోర్డు సెక్రటరీగా, ఇంటర్మీడియేట్ కమిషనర్​గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో మాట్లాడారు.  ఎంప్లాయీస్ అంతా క్రమశిక్షణతో ఉండాలని, సమయ పాలన పాటించాలని సూచించారు.

సెక్షన్లలో పనులను పెండింగ్​లో పెట్టొద్దని, ఏ రోజు పని ఆ రోజే చేయాలని ఆదేశించారు. ఫిజికల్ ఫైల్స్ పంపొద్దని.. ఏమైనా ఈ– ఆఫీస్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ఆదిత్యను ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి, టీఐజీఎల్​ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, రామకృష్ణగౌడ్, టీజీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం తదితరులు అభినందనలు చెప్పారు.