
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని కేంద్రాల్లో సోమవారం నాటికి గోడ గడియారాలను ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ మేరకు ఇంటర్ ఎగ్జామ్స్ సీఎస్, డీఓలకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో భాగంగా విద్యార్థులు చేతిగడియారాలు కూడా సెంటర్లలోకి తీసుకుపోవద్దని నిబంధన పెట్టారు. ఈ క్రమంలో ప్రతి అరగంటకోసారి బెల్ కొట్టాలని ఆదేశాలిచ్చారు.
కొన్ని చోట్ల బెల్ సరిగా వినిపించడం లేదని, మరికొన్ని చోట్ల గంటకోసారి కొడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అన్ని సెంటర్లలో గోడ గడియారాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ప్రతి సెంటర్ కు రూ.వెయ్యి, అంతకు ఎక్కువగా ఫండ్ రిలీజ్ చేయనున్నట్టు కృష్ణ ఆదిత్య చెప్పారు. క్లాసు రూముల్లో గడియారాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఎప్పుడైనా సమయం చూసుకునే అవకాశం ఏర్పడింది. అయితే, సెంటర్ లోని అన్ని రూంలలో గడియారాల ఏర్పాటుకు ఈ ఫండ్స్ సరిపోవని, ఇంటర్ బోర్డు అధికారులే బల్క్ గా కొని సెంటర్లకు సరఫరా చేస్తే బాగుంటుందని సీఎస్, డీఓలు చెప్తున్నారు.