- ఫైర్ సేఫ్టీ లేని కాలేజీలకు ఇటీవల సర్కార్ అనుమతి
- ఒక్కో కాలేజీకి రూ.లక్ష ఫైన్ వేసిన ఇంటర్ బోర్డు
- ఆ కాలేజీల్లోని ఒక్కో స్టూడెంట్‌కు రూ.2,500 ఎగ్జామ్ ఫీజు ఫైన్
- ఈ ఫైన్లు కట్టబోమంటున్నప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు
- కట్టాల్సిందేనంటున్న ఇంటర్ బోర్డు అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ లో మరో లొల్లి మొదలైంది. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు సర్కార్ ఈ ఏడాది స్పెషల్ పర్మిషనన్ ఇచ్చినా, ఆయా కాలేజీలు మాత్రం గుర్తింపు కోసం ఇంటర్ బోర్డుకు అప్లై చేసుకోవడం లేదు. దీనికి ఇంటర్ బోర్డు వేసిన ఫైనే కారణం. కాలేజీలు, స్టూడెంట్లపై వేసిన ఫైన్ ను ఎత్తివేయాలని మేనేజ్మెంట్లు పట్టుబడుతుండగా.. నిబంధనల ప్రకారం ఫైన్ కట్టాల్సిందేనని ఇంటర్ బోర్డు తేల్చిచెబుతున్నది. దీంతో ఇంటర్ బోర్డు వర్సెస్ ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
అఫిలియేషన్ల ప్రక్రియ ముగియడంతో ఫైన్..
రాష్ట్రంలో 2024–25 విద్యాసంవత్సరానికి గాను సుమారు 220 ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ మినహాయింపు ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ ఎన్వోసీ లేని కాలేజీల్లో క్లాసు రూముల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. వీటిని ఆన్ లైన్ పోర్టల్ లో అప్ లోడ్ చేసి, ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఇంటర్ బోర్డు అఫిలియేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. చివరగా రూ.లక్ష ఫైన్‌తో కాలేజీలకు గుర్తింపు ఇచ్చింది. ప్రస్తుతం సర్కార్ అనుమతిస్తున్న కాలేజీలు కూడా ఇదే ఫైన్ కట్టాలని ఇంటర్ బోర్డు నిబంధన పెట్టింది. దీనికితోడు ఎగ్జామ్ ఫీజు గడువు కూడా ముగియడంతో ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా రూ.2,500 ఫైన్ తో ఫీజు చెల్లించాలని ఆదేశించింది. స్టూడెంట్ అడ్మిషన్ ఫీజు కూడా రూ.200 ఫైన్ తో చెల్లించాల్సి ఉంది. దీంతో ఇటు 220 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలతో పాటు స్టూడెంట్లపై భారం పడుతున్నది.
మేనేజ్మెంట్లలో భయం..
రెండు నెలల కిందనే చాలా కాలేజీలు స్టూడెంట్ల నుంచి ఎగ్జామ్ ఫీజు వసూలు చేశాయి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజుకు సంబంధించిన ఫైన్ ను స్టూడెంట్ల దగ్గర అడిగితే, తమ కాలేజీలకు గుర్తింపు లేదనే విషయం తెలిసిపోతుందని మేనేజ్మెంట్లలో భయం మొదలైంది. అందుకే తాము ఎలాంటి ఫైన్ కట్టబోమని మేనేజ్మెంట్లు అంటున్నాయి. ఐదు రోజుల్లో కేవలం 25 నుంచి 30 కార్పొరేట్ కాలేజీలు మాత్రమే అఫిలియేషన్ కోసం రూ.లక్ష ఫైన్ కట్టి ఇంటర్ బోర్డుకు అప్లై చేసుకున్నాయి.
ఫైన్ ఎత్తివేస్తేనే అఫిలియేషన్ కోసం అప్లై చేసుకుంటామని మిగిలిన కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పంచాయితీ ప్రస్తుతం విద్యాశాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రులను ప్రైవేటు మేనేజ్మెంట్ల ప్రతినిధులు కలుస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉండటంతో ఆయన జోక్యం చేసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదని చెప్తున్నారు. దీంతో విదేశీ పర్యటనలో ఉన్న ఆయన దృష్టికి సమస్యను తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ ఆఫీసర్లపై చర్యలేవీ?
ఫైర్ ఎన్వోసీ లేని కాలేజీలకు స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలని జనవరి 15న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం ఆయా కాలేజీల్లో చదివే సెకండియర్ స్టూడెంట్లకు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చేశారు. ఆయా కాలేజీలకు గుర్తింపు లేకున్నా, వాటిలో చదివే సెకండియర్ విద్యార్థుల ఎగ్జామ్ ఫీజును ఎప్పుడో కట్టించుకున్నారు. దీనిపై బోర్డులోని ఓ అధికారి తప్పిదమే కారణమని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
కాలేజీల గుర్తింపు ప్రక్రియ అంశాలన్నీ అకడమిక్ సెల్ అధికారులు సక్రమంగా చూసుకోకుండా, నిర్లక్ష్యంగా ఉండటంతోనే ఈ సమస్య ఏర్పడినట్టు పేర్కొంటున్నారు. కాలేజీలకు గతంలో రెండేండ్ల పాటు గుర్తింపు ఇచ్చింది, ఈ ఏడాది సెకండియర్ కు కూడా అఫిలియేషన్ లేదనే విషయం తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇంత పెద్ద తప్పిదం జరిగినా ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం.. ఆ నిర్లక్ష్యానికి కారణమైన ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
రూల్స్ ప్రకారమే ఫైన్: బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
నిబంధనల ప్రకారమే కాలేజీలు, స్టూడెంట్లకు ఫైన్ విధించామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. అయితే సర్కార్ ను బద్నాం చేసేందుకే ఇంటర్ బోర్డు సెక్రటరీ ఇలాంటి చర్యలకు దిగుతున్నారని జీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ ఆరోపించారు. గతంలో మాదిరిగా రూ.వంద ఫైన్‌తోనే ఎగ్జామ్ ఫీజు తీసుకోవాలని డిమాండ్ చేశారు.