- తన కుటుంబంపైనా దాడి చేసినట్టు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్
- సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి మరో కులాంతర ప్రేమకథ
సూర్యాపేట, వెలుగు : పది రోజుల కింద సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాల బంటి పరువు హత్య కేసు మరువక ముందే.. మరో కులాంతర ప్రేమను ఇష్ట పడని యువతి కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడిపై దాడికి పాల్పడినట్టు తెలిసింది. తన హత్యకు ప్లాన్ కూడా చేశారని బాధిత యువకుడు ఆరోపిస్తూ మంగళవారం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు కామేశ్, యువతి రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇది ఆమె కుటుంబ సభ్యులు తెలియడంతో వేరొకరితో పెండ్లి ఫిక్స్ చేసి ఎంగేజ్‌మెంట్ చేశారు. కాగా ఆమె తన లవర్ కు ఫోన్ చేసి పెండ్లి చేసుకోవాలని, లేకపోతే చనిపోతానని భయపెట్టడడంతో అతడు ఓకే చెప్పాడు. ఇది తెలిసిన యువతి కుటుంబసభ్యులు అతడి హత్యకు ప్లాన్ చేశారు. ముందుగా యువతితో ఫోన్ చేయించి అతడిని ఇంటికి రావాలని కోరగా సోమవారం రాత్రి వెళ్లాడు. అతనిపై దాడి చేయగా తప్పించుకుని పారిపోతుండగా వెంబడించి యువకుడి ఇంటికి వెళ్లి మరోసారి కత్తులతో దాడి చేశారు.
దీంతో అడ్డుకోబోయిన అతడి తల్లిదండ్రులపై, నానమ్మ దాడికి దిగడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా అతని పెదనాన్న ఇంటికి కూడా వెళ్లి వెతికారు. ఆపై యువతితో పట్టణ పీఎస్ లో యువకుడిపై రేప్, గంజాయి కేసులు పెట్టించారు. యువతి కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని, తనను చంపేందుకు సుపారీ ఇచ్చారని , ఇప్పటికైనా పోలీసులు స్పందించి న్యాయం చేయాలని అతడు వీడియోలో కోరాడు. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. యువకుడి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.