ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ

ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ

స్టూడెంట్లను మోసం చేసిన కాలేజీ

ఫీజు వసూలు చేసి బోర్డుకు చెల్లించని వైనం
హాల్ టికెట్లు ఆపేసిన బోర్డు..
మంగళవారం రాత్రి అందజేత

నాంపల్లి(హైదరాబాద్), వెలుగు: ఓ ప్రైవేటు కాలేజీ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం 42 మంది స్టూడెంట్లను ఇంటర్ పరీక్షలకు దూరం చేసింది. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేసినా.. ఇంటర్ బోర్డుకు ఫీజు కట్టలేదు. దీంతో ఫీజు కట్టని స్టూడెంట్ల హాల్ టికెట్లను బోర్డు ఆపేసింది. తెల్లారితే పరీక్ష.. మిగతా విద్యార్థులేమో పుస్తకాలతో కుస్తీ పడుతుంటే, వారు మాత్రం ఇంటర్ బోర్డ్​ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. వివరాలు.. కొత్తపేటకు చెందిన శ్రీమేధావి కాలేజ్‌లో చదువుతున్న ఇంటర్ ఫస్ట్, సెకండియర్ స్టూడెంట్లు 42 మందికి హాల్ టికెట్లు అందలేదు. కాలేజ్‌లో అడిగితే రేపు, మాపు అని తిప్పుకున్నారని చెప్పారు. తీరా తెల్లారితే పరీక్ష ఉండడంతో ప్రిన్సిపాల్ శోభను నిలదీస్తే.. మేనేజ్‌మెం‌ట్ వారి పరీక్ష ఫీజు కట్టలేదని బయటపడిందన్నారు. తాము చెల్లించిన ఫీజు బోర్డ్‌కు చెల్లించకుండా కాలేజ్ మేనేజ్‌మెంట్ తమ జీవితాలతో ఆడుకుందని వాపోయారు. దీంతో మంగళవారం వారంతా నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసుకు చేరుకుని అధికారులను ప్రాధేపడ్డారు. మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం కారణంగా తాము అకడమిక్ ఇయర్ కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్‌ను వేడుకున్నారు. దీంతో మంగళవారం రాత్రి వారికి హాల్ టికెట్లు అందజేశారు. ఈ విషయంలో శ్రీమేధావి కాలేజ్ పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఉమర్ జలీల్ చెప్పారు.