సిద్దిపేట రూరల్, వెలుగు: వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 3 తులాల బంగారు నగలు, రూ.7630 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం త్రీ టౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ అల్వాల్, సూర్య నగర్ కాలనీకి చెందిన తూర్పాటి ప్రసాద్ జులాయిగా తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నాడు.
నవంబర్ 11న సిద్దిపేటలోని రాజేంద్రనగర్ హనుమాన్ ఆలయంలో హుండీని పగలగొట్టి అందులోని డబ్బులను ఎత్తుకెళ్లాడు. అదే రోజు సందీప్ నగర్ లో ఉన్న బండారి సక్కుబాయి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ. 90,000 విలువైన బంగారు వస్తువులను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. రంగధాంపల్లి వద్ద ప్రసాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా అతడు గతంలో కూడా పలు జిల్లాల్లో చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు సీఐ తెలిపారు.