ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇవాళ(శుక్రవారం, జూన్-12) విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్ ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాల వారీగా చూస్తే  ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 75 శాతంతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్ధానంలో పశ్చిమ గోదావరి, గుంటూరు(65%),  ఆ తర్వాత మూడో స్థానంలో విశాఖపట్నం(63%) ఉన్నాయి.  సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా కృష్ణా జిల్లా (75%)  మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పశ్చిమగోదావరి(71%), మూడో స్థానంలో నెల్లూరు, విశాఖ పట్నం(68%) నిలిచాయి.

విద్యార్థులు bie.ap.gov.in వెబ్ సైట్ లో  హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ 5,07,228 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఉత్తీర్ణులైన వారు 3.00,560 మంది.  వీరిలో బాలికలు 2,57,169 మంది పరీక్షలు రాయగా…పాసైన వారు 1,64,365. బాలురు 2,49,611 మంది పరీక్షలు రాయగా..పాసైన వారు 1,36,195.

ఇక సెకండ్ ఇయర్ లో 4,35,655 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా..పాసైన వారు 2,76,389 మంది. ఇందులో2,22,798 బాలికలు పరీక్షలు రాయగా..పాసైన వారు 1,49,010. సెకండియర్ పరీక్షలు రాసిన బాలురు 2,12,857 మంది. ఇందులో పాసైనవారు 1,27,379 .

ఒకేషనల్‌ మొదటి సంవత్సరం 39,139 మంది, రెండో సంవత్సరం 29,993 మంది మొత్తం 10,65,155 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఫలితాల షార్ట్‌ మార్కుల మెమోలు ఈనెల 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు బోర్డు అధికారులు.