గచ్చిబౌలి, వెలుగు: ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రి పరిధి కొత్తపేటకు చెందిన నాగేంద్రరావు, దుర్గ దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి సిటీకి వలస వచ్చి మణికొండ కేపీఆర్ కాలనీలోని ఏజేఆర్ ఆర్కిడ్ లో ఉంటున్నారు. నాగేంద్రరావు, దుర్గ స్థానిక ఇండ్లలో పనిచేస్తున్నారు.
వారి చిన్న కూతురు శాంతికుమారి(16) మధురానగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం ఇంటర్ రిజల్ట్స్ రాగా.. శాంతికుమారి 3 సబ్జెక్టుల్లో ఫెయిలైంది. మధ్యాహ్నం తల్లిదండ్రులు పనిముగించుకుని ఇంటికి రాగా.. రిజల్ట్ గురించి వారికి చెప్పేందుకు శాంతికుమారి భయపడింది. మధ్యాహ్నం 12 గంటలకు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తల్లిదండ్రులు గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. కండీషన్ సీరియస్‌గా ఉండటంతో గాంధీకి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శాంతికుమారి మృతి చెందింది.
ఉప్పర బస్తీలో..
ఖైరతాబాద్ : పంజాగుట్ట పీఎస్ పరిధిలో మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఉప్పర బస్తీలో ఉండే అంబటి హరిత (18) ఇంటర్ సెకండియర్‌లో ఫెయిలైంది. మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది.