ఇంటర్​ ఎగ్జామ్స్​ షురూ .. 5 నిమిషాలు ఆలస్యమైనా సెంటర్లలోకి అనుమతి 

ఇంటర్​ ఎగ్జామ్స్​ షురూ .. 5 నిమిషాలు ఆలస్యమైనా సెంటర్లలోకి అనుమతి 
  • గంట ముందే సెంటర్లకు చేరుకున్న స్టూడెంట్లు
  • ఉదయం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
  • గ్రేటర్​లో 97.50 శాతం స్టూడెంట్స్​ హాజరు

హైదరాబాద్ సిటీ నెట్​వర్క్, వెలుగు: గ్రేటర్ లో బుధవారం ఇంటర్ ఫస్టియర్​పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. స్టూడెంట్స్​కు టెన్షన్​గా మారిన ఒక్క నిమిషం నిబంధన ఎత్తేసి ఐదు నిమిషాల వరకు సమయం ఇవ్వడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో ఉదయం వేళలో ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లేవారితో ట్రాఫిక్​ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో చాలా మంది గంట ముందే సెంటర్లకు చేరుకున్నారు. ఈ పరిస్థితిని ఊహించని మరికొందరు తిప్పలు పడ్డారు. కూకట్ పల్లి, ఉప్పల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తో సమయానికి చేరుకుంటామో లేదో అని కొందరు ఆందోళనకు గురయ్యారు.

అయినా, అక్కడక్కడా సమయానికి చేరుకోలేని అతికొద్ది మంది పరీక్ష రాయలేకపోయారు. సెంటర్లలో హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు. మొదటి రోజు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్ధు, అరబిక్ సబ్జెక్ట్స్ కు సంబంధించిన పరీక్షలను 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ఫస్ట్​డే పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 97.50 శాతం హాజరు నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ జనరల్, ఒకేషనల్ 87,523 మంది, రంగారెడ్డి జిల్లాలో జనరల్​81,966 మంది, ఒకేషనల్​కు సంబంధించి 69,842 మంది ఎగ్జామ్స్ రాశారు.  గురువారం నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 

సెంటర్లను తనిఖీ చేసిన అధికారులు..

మొదటి రోజు పలువురు అధికారులు సెంటర్లను విజిట్​చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య నారాయణగూడలోని రత్న, జాహ్నవి, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలను విజిట్​చేసి పరీక్షల తీరును పరిశీలించారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నాంపల్లి మండలంలోని విజయనగర్ జూనియర్ కామర్స్ కాలేజీ ఎగ్జామ్స్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.