
ఇంటర్ ఫస్టియర్ జువాలజీలో 60/60 మార్కులు సాధించడానికి మంచి ఛాన్స్ ఉంది. సిలబస్ చదవడం పూర్తయిన వారు ఈ టైమ్‌లో ప్రతి యూనిట్ ను వెయిటేజీ ఆధారంగా చదువు కుంటే ఈజీ అవుతుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చే యూనిట్లను రివిజన్ చేసుకోవాలి. గతంలో అడిగిన ప్రశ్నలను చదువుతూనే కొత్తగా యాడ్ చేసిన సిలబస్‌పై దృష్టి పెట్టాలి. మ్యాప్‌లు గీస్తూ చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. జంతుదేహ నిర్మాణం, ప్రొటోజోవా గమనం– ప్రత్యుత్పత్తి, జీవావరణం–పర్యావరణం, బొద్దింక యూనిట్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
యూనిట్-1
జీవ ప్రపంచ వైవిధ్యం (6 మార్కులు)
ఫస్ట్ యూనిట్ నుంచి నిర్వచనాలు, జాతి–ప్రజాతి నుంచి 2మార్కుల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. జీవ వైవిద్యం, వర్గీకరణ నుంచి 4మార్కుల ప్రశ్నలు అడగవచ్చు.
యూనిట్-2
జంతుదేహ నిర్మాణం (10)
ఈ యూనిట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు నాలుగు మార్కులు, లేదా 8 మార్కుల ప్రశ్నలు అడిగే చాన్స్ ఉంది.ఇందులో డయాగ్రామ్ గీసి భాగాలు గుర్తించమని అడగవచ్చు. జంతుకణజాలం సంబంధించి పటాలను ప్రాక్టీస్ చేయాలి.
యూనిట్-3
అకశేరుకాలు (6)
అకశేరుకాలకు సంబంధించి థియరీ పార్ట్ చదివి నోట్ బుక్‌లో వర్గీకరణ, జీవుల రకాలు, వాటి లక్షణాలను టేబుల్ వేసుకుంటే చదవడానికి ఈజీగా ఉంటుంది. ఆన్సర్ రాసేటప్పుడు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. ఈ టాపిక్ నుంచి 4మార్కుల ప్రశ్న, 2మార్కుల ప్రశ్న ఒక్కొక్కటి అడిగే అవకాశం ఉంది.
యూనిట్-4
కార్డేటా (6)
ఈ యూనిట్ కూడా అకశేరుకాలు టాపిక్ లాగానే టేబుల్ వేసుకుని చదివితే బాగుంటుంది. రివిజన్ టైమ్‌లో అకశేరుకాలు, కార్డేటా రెండు టేబుల్స్ కంపేర్ చేసుకుంటూ చదివితే జీవుల ఉదాహరణలు రాసే క్రమంలో గజిబిజి ఉండదు.
యూనిట్-5
ప్రొటోజోవా– ప్రత్యుత్పత్తి ( 8)
ఇది ఇంపార్టెంట్ యూనిట్. ఇందులోంచి 8 మార్కుల ప్రశ్న అడగొచ్చు. యూగ్లీనా, పారమీషియం పటాలు గీసి భాగాలు గుర్తించడం, రెండింటిలో ద్విదావిచ్ఛిత్తి వివరణ అడగవచ్చు. కశాభాలు, శైలికలు, మిథ్యాపాదాలు బేధాలు సంబంధించి 4 మార్కుల ప్రశ్న అడగవచ్చు.
యూనిట్-6
మానవ సంక్షేమం–జీవశాస్ర్తం
( 14)
మానవ సంక్షేమంలో జీవశాస్త్రం యూనిట్ నుంచి 8మార్కుల ప్రశ్నతో పాటు 4మార్కులు, ఒక రెండు మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇందులో పరాన్న జీవులు రకాలు, వాటి వల్ల వచ్చే వ్యాధులు, ప్రాథమిక అతిథేయి, ద్వితీయ అతిథేయి, ప్లాస్మోడియం, ఉకరేరియా జీవిత చక్రం పై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
యూనిట్-7
బొద్దింక (12)
బొద్దింక యూనిట్ నుంచి పటాలు గీసి భాగాలు గుర్తించమని ఎక్కువ సార్లు అడుగుతున్నారు. ఇందులో బొద్దింక జీర్ణవ్యవస్థ, నోటి భాగాలు, లాలాజల గ్రంథులు నేత్రాంశం వంటి పటాలు ప్రాక్టీస్ చేయాలి.
యూనిట్-8
జీవావరణం–పర్యావరణం (14)
ఈ యూనిట్ ఇంపార్టెంట్నుం. కాలుష్యం, గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్, ఆహారపు గొలుసు జీవావరణ వ్యవస్థ నుంచి 8 మార్కుల ప్రశ్న అడిగే అవకాశం ఉంది. పర్యావరణ కాలుష్యం కారణంగా మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన తెచ్చుకుని నిత్యజీవితానికి అన్వయించుకుంటూ ఆన్సర్ రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్
సెక్షన్–ఎ
ప్రతి యూనిట్ నుంచి తప్పనిసరిగా 2మార్కుల ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 10 క్వశ్చన్స్‌కు 20 మార్కులు ఉంటాయి . 60/60 మార్కులు టార్గెట్ ఉన్నవారికి ఇది కీలకమైన పార్ట్. ప్రతి క్వ
శ్చన్‌ను తప్పనిసరిగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ చదివితే నీట్, ఎంసెట్ ఎగ్జామ్స్‌కు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.
సెక్షన్–బి
ప్రతి యూనిట్ నుంచి ఒక ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది. మొత్తం 8ప్రశ్నలు ఇస్తే 6ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. 24 మార్కులు ఉంటాయి. ఇందులో 2 పటాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. చక్కగా పటం గీసి భాగాలు గుర్తిస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. బొద్దింక, పారమీషియం, యూగ్లీనా పటాలుప్రాక్టీస్ చేస్తే ఇందులోనుంచి అడిగే అవకాశం ఉంది.
సెక్షన్–సి
ఇందులో 8మార్కుల ప్రశ్నలు అడుగుతారు. 3ప్రశ్నలు ఇస్తే 2రాయాల్సి ఉంటుంది. 16 మార్కులు ఉంటాయి. పటాలను అధ్యయనం చేస్తే ఆన్సర్ ను వివరంగా రాయవచ్చు. జంతు
దేహ నిర్మాణం, ప్రొటోజోవా గమనం ప్రత్యుత్పత్తి, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం యూనిట్‌ల నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. వీటిలో లాంగ్‌క్వశ్చన్స్ ఏదీ వదలకుండా చదవాలి.
మోడల్ పేపర్
2 మార్కుల ప్రశ్నలు
- కణజాల శాస్త్రాన్ని నిర్వచించండి. దీనికి మరో పేరు ఏమిటి?
- నెమ్మదిగా చలించే జీవులకు లేదా వృంతరహిత జీవులకు వ్యాసార్ధ సౌష్ఠవం అనుకూలనం నిరూపించండి.
- స్నాయువు, స్నాయు బంధనం మధ్య తేడాలను తెలపండి.
- హిమాటోక్రిట్ విలువ అంటే ఏమిటి?
- ఆంఫిడ్‌లు, ఫాస్మిడ్‌ల మధ్య బేధాన్ని తెలపండి?
- వాతిలాస్ధుల అంటే ఏమిటి? అవి పక్షులకు ఎలా తోడ్పడతాయి?
- కశాభానికి, శైలికకి మధ్య రెండు భేదాలు రాయండి.
- అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా ఏర్పడిన పిల్ల జీవులను క్లోన్ అని ఎందుకు అంటారు.
- ఆస్కారిస్ గుడ్లను ‘మామ్మిల్లేడిడ్ గుడ్లు’ అని ఎందుకు అంటారు?
- భ్రమణరూప విక్రియ అంటే ఏమిటి?డాఫ్నియాలో దాని ప్రాముఖ్యం వివరించండి.
4 మార్కుల ప్రశ్నలు
- బయోడైవర్నిటీ హాట్ స్పాట్స్ గురించి లఘుటీక రాయండి.
- బహుధృవ న్యూరాన్ నిర్మాణం వివరించండి.
- చేపలను ఇతర సకశేరుకాల నుంచి వేరు చేసే ఎనిమిది లక్షణాలను రాయండి.
- ఎకినాయిడ్‌ల ప్రధాన లక్షణాలను పేర్కొనండి.
- పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి.
- మిథ్యాపాదాల గురించి వ్యాఖ్య రాయండి.
- బొద్దింక లాలాజల పరికరపు చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి.
- స్ర్టాటో స్పియర్ ఓజోన్ క్షీణత వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి?
8 మార్కుల ప్రశ్నలు
- దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రాన్ని పటం సహాయంతో వివరించండి.
- బొద్దింక శ్వాసవ్యవస్థను భాగాలు గుర్తించి చక్కని పటం సహాయంతో వర్ణించండి.
- జీవావరణ వ్యవస్థలో కనిపించే వివిధ ఆహారపు గొలుసులను వివరించండి.