రేపటి (ఫిబ్రవరీ 2) నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ హాజరుకానున్న 4.29 లక్షల మంది

రేపటి (ఫిబ్రవరీ 2) నుంచి ఇంటర్  ప్రాక్టికల్స్ హాజరుకానున్న 4.29 లక్షల మంది
  • సీసీటీవీ కెమెరాల మధ్యలోనే పరీక్షలు
  • ఇంటర్  బోర్డు సెక్రటరీ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం నుంచి ఇంటర్మీడియెట్  ప్రాక్టికల్  పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 4,29,052 మంది అటెండ్  కానుండగా, వారి కోసం 2008 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లను ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం కాలేజీ లాగిన్స్ లో పెట్టారు.  శనివారం ఇంటర్  బోర్డు ఆఫీసులో పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలకు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య.. ఎగ్జామినేషన్  కంట్రోలర్ జయప్రద బాయితో కలిసి మీడియాకు వివరించారు. ఈనెల 3 నుంచి 22 వరకూ ఇంటర్  ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 

రోజూ రెండు విడుతల్లో ఎగ్జామ్స్ ఉంటాయని,  ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మార్నింగ్  సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆఫర్ట్ నూన్  సెషన్ లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. హాల్ టికెట్లను కాలేజీ లాగిన్లతో పాటు స్టూడెంట్  మొబైల్  ఫోన్లకూ పంపుతున్నామని తెలిపారు. ప్రతి కాలేజీలోనూ సీసీటీవీ కెమెరాల మధ్యలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రైవేటు కాలేజీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు మేనేజ్మెంట్లు అంగీకరించాయని వెల్లడించారు. 

టెక్నికల్ తప్పిదం నిజమే..

ఇంటర్  కాలేజీల అఫియేషన్ల విషయంలో టెక్నికల్  తప్పిదం జరిగిందని కృష్ణ ఆదిత్య తెలిపారు. దీంతోనే ఫైర్ ఎన్ఓసీ కాలేజీలకు గుర్తింపు లేకున్నా.. వాటిలోని సెకండియర్ విద్యార్థులకు ఎగ్జామ్  ఫీజు తీసుకున్నామని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ తాను సెక్రటరీగా బాధ్యతలు తీసుకోక ముందే జరిగిందని,  అఫిలియేషన్ల ప్రక్రియలో భవిష్యత్తులో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.