- ఇంటర్ ప్రాక్టికల్స్ నేపథ్యంలో బోర్డు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వచ్చేనెల 3 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు బోర్డు సమాయత్తం అవుతున్నది. గవర్నమెంట్ కాలేజీలతో పాటు కేజీబీవీలు, అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని గురుకులాల్లో 1,200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది.
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరిగే గదుల్లోనే బిగించేలా నిర్ణయం తీసుకున్నది. మెయిన్ పబ్లిక్ పరీక్షలనూ పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి అన్ని కాలేజీల సీసీ కెమెరాలను అనుసంధానం చేయబోతున్నారు.
ఈ బాధ్యతలను బ్రిహస్పతి టెక్నాలజీస్ కంపెనీకి ఇంటర్ బోర్డు అప్పగించింది. ఒక్కో కాలేజీలో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేషనల్ ప్రాక్టికల్స్ కేంద్రాలుంటే 8 సీసీ కెమెరాలు బిగించనున్నారు. మొత్తంగా 5,500 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
దీనిపై ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదబాయి మాట్లాడుతూ... అన్ని కాలేజీల్లో బుధవారం నుంచి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కానున్నదని వెల్లడించారు. దీనికి సుమారు రూ.పది కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
ఇవే కెమెరాలను పబ్లిక్ పరీక్షలకు, స్పాట్ క్యాంపుల్లోనూ వినియోగిస్తామని స్పష్టం చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు గానూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.