ఏజెన్సీలో క్రీడా సంబురం..5 వేల మందికిపైగా పాల్గొంటున్న క్రీడాకారులు

  •     అట్టహాసంగా ఇంటర్‌‌ స్పోర్ట్స్‌‌ లీగ్‌‌ పోటీలు ప్రారంభం
  •     హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు
  •     5 వేల మందికిపైగా పాల్గొంటున్న క్రీడాకారులు

గుడిహత్నూర్, వెలుగు :  ఏజెన్సీలో ఇంటర్​స్పోర్ట్స్​లీగ్​పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉట్నూర్‌‌ లోని కేబీ కాంప్లెక్స్‌‌ క్రీడా మైదానంలో 7వ ఇంటర్‌‌ సొసైటీ స్పోర్ట్స్‌‌ లీగ్‌‌ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో దాదాపు 5 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌‌ వెంకట్‌‌ నరసింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌‌, ఆదిలాబాద్‌‌ ఎంపీ సోయం బాపూరావు, బోథ్‌‌ ఎమ్మెల్యే అనిల్‌‌ జాదవ్, సోషల్‌‌ వెల్ఫేర్‌‌ సెక్రటరీ నవీన్‌‌ నికోలస్, జిల్లా ఎస్పీ గౌస్‌‌ ఆలమ్

ఐటీడీఏ పీఓ చాహత్‌‌ బాజ్‌‌పాయ్‌‌ తదితరులు పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌‌ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. రెసిడెన్షియల్‌‌ స్కూళ్ల స్టూడెంట్లు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

వసతులు కల్పించేందుకు కృషి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించడంతో క్రీడాకారులు ఒలంపిక్స్, ఏసియన్‌‌ క్రీడల్లో భారీగా పతకాలు సాధిస్తున్నట్లు ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా వంటి పోటీలను నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులు క్రీడలలో రాణించేందుకు అవసరమైన వసతులు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1022 గురుకుల విద్యాసంస్థల్లోని 5 వేల మంది విద్యార్థులకు పైగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం, వికాసానికి స్పోర్ట్స్‌‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ కమిషన్‌‌ సభ్యురాలు ఈశ్వరీ బాయి, అసిస్టెంట్‌‌ ట్రైనీ కలెక్టర్‌‌ వికాస్‌‌ మహతో, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.