కేంద్ర, రాష్ట్రాల మధ్య వివిధ రాష్ట్రాలకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు అంతర్రాష్ట్ర మండలి ఉండాలని ఆర్టికల్ 263 పేర్కొంటుంది. ఆర్.ఎస్.సర్కారియా కమిషన్ 1988 జనవరిలో ఇచ్చిన నివేదిక ప్రకారం శాశ్వత ప్రాతిపదికన ఇంటర్ గవర్నమెంటల్ కౌన్సిల్‌ను ఆర్టికల్ 263 కింద ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. దీని ఆధారంగా 1990 మే 28న వి.పి.సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. అంటే ఇది శాశ్వత రాజ్యాంగబద్ద సంస్థ కాదు. ఈ మండలికి చైర్మన్ ప్రధాన మంత్రి కాగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాసనసభలు గల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండాలి. కేంద్ర హోంమంత్రితో సహా ప్రధాని నామినేట్ చేసే ఆరుగురు కేబినెట్ మంత్రులు, ప్రధాని నామినేట్ చేసే శాశ్వత ఆహ్వానితులు ( కేంద్ర మంత్రులు) ఉంటారు. అంతర్రాష్ట్ర మండలిలో మొదటిసారిగా 1990 డిసెంబర్ 27న సభ్యులను నియమించడమైంది. కాగా తాజాగా 2019లో నూతన సభ్యుల కూర్పు జరిగింది. ఆరుగురు కేంద్ర మంత్రులు. రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, తావర్‌చంద్ గెహ్లాట్, హరిదీప్ సింగ్‌పురి. ప్రస్తుతం శాశ్వత ఆహ్వానితులుగా 10 మంది కేంద్ర మంత్రులు అంతర్ రాష్ట్ర మండలిలో ఉన్నారు.
విధులు: రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిశీలించి సలహాలు ఇవ్వడం.
వివిధ రాష్ట్రాలకు, కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను పరిశీలించి, చర్చించి నివేదిక ఇవ్వడం.
మండలి చైర్మన్ అంటే ప్రధాన మంత్రి సూచించిన రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే అంశాల పరిశీలన.
మండలి స్థాయి సంఘం: చైర్మన్ కేంద్ర హోంమంత్రి
మండలి సచివాలయం: దీనికి అధ్యక్షులుగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదా గలవారు వ్యవహరిస్తారు.
దీనిని 1991లో న్యూఢిల్లీలో (విజ్ఞాన్ భవన్) ఏర్పాటు చేశారు. 2011 నుంచి జోనల్ మండళ్లకు కూడా సచివాలయంగా వ్యవహరిస్తుంది.
పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర మండలులు
1. భారత వైద్య కేంద్ర మండలి
2. కేంద్ర హోమియోపతి మండలి
ఆర్టికల్ 263 కింద రాష్ట్రపతి ఏర్పాటు చేసే అంతర్రాష్ట్ర మండళ్లు.
1. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మండలి
2. అమ్మకం పన్ను కోసం ఏర్పాటు చేయబడిన ప్రాంతీయ మండళ్లు
3.స్థానిక ప్రభుత్వ, పట్టణాభివృద్ధి కేంద్ర మండలి
అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందం
కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో సఖ్యతను పెంపొందించడానికి అంటే అధికారాల విభజన స్పష్టంగా ఉండటం కోసం అంతర్రాష్ట్ర సంబంధాలు కీలకమైనవి. రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ-17 నీటి గురించి చర్చిస్తుంది. (నీటి సరఫరా, నీటిపారుదల, డ్రైనేజీ) కేంద్ర జాబితాలోని ఎంట్రీ - 56 ప్రజా అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర నదులు, నదీలోయల నియంత్రణ, అభివృద్ధిని చేపట్టవచ్చు. ఆర్టికల్ 262 జల వివాదాలకు సంబంధించింది. ఆర్టికల్ 262(1) ఏదైనా అంతర్ రాష్ట్ర నది లేదా నదీలోయకు సంబంధించిన జలాల ఉపయోగం, పంపిణీ, నియంత్రణకు సంబంధించిన వివాద పరిష్కారానికి పార్లమెంట్ చట్టం చేస్తుంది. దీనిలో భాగంగా 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టాన్ని చేసింది. అలాగే 1956లో రివర్ వాటర్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి బోర్డులను ఏర్పాటు చేయదలిచింది. కాని ఇప్పటివరకు ఇలాంటి బోర్డులు ఏర్పాటు కాలేదు. ఆర్టికల్ 262(2) ప్రకారం పైన చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు లేదా ఇతర కోర్టులు న్యాయసమీక్ష చేయరాదు.
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు- 2019: ఇది 1956 చట్టానికి సవరణ. అంతర్రాష్ట్ర నదీ జలాలు, నదీ లోయల వివాదాల సత్వర పరిష్కారం దీని ఉద్దేశం. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ వివాద పరిష్కారం కోసం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు.
వివాద పరిష్కార కమిటీ
ఏదైనా ఒక రాష్ట్రం జల వివాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం వివాదాల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసి స్నేహపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. వివాద పరిష్కార కమిటీలో చైర్ పర్సన్, సభ్యులు (కనీసం 15 సంవత్సరాలు సంబంధిత రంగంలో నిష్ణాతులు), వివాదాస్పద రాష్ట్రాల నుంచి ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి సభ్యుడు ఉంటారు. చైర్ పర్సన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించగా, రాష్ట్రాల నుంచి నామినేట్ చేయబడే సభ్యుడిని సంబంధిత రాష్ట్రమే నామినేట్ చేస్తుంది. ఏడాది కాలంలో ( ఆరు నెలలు పొడిగించే అవకాశం) పరిష్కరిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది.
అంతర్రాష్ట్ర నదీజల వివాదాల ట్రిబ్యునల్
గతంలో ఉన్న ప్రత్యేక ట్రిబ్యునల్స్ అన్నీ రద్దు చేసి, బహుళ బెంచ్‌లను ఏర్పాటవుతాయి. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌తోపాటు ముగ్గురు న్యాయ సభ్యులు, ముగ్గురు ఎక్స్పర్ట్ సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. మూడేండ్లలో నిర్ణయం తెలపాలి. అయితే మరో రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు. దీని నిర్ణయం సుప్రీంకోర్టు ఆర్డర్‌కు సమానం.
ఇప్పటివరకు ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్
ట్రిబ్యునల్ స్థాపన పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు
కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ 1969 మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ 1969 కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
నర్మద జలాల వివాదాల ట్రిబ్యునల్ 1969 రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర
రవి, బియాస్ జలాల వివాదాల ట్రిబ్యునల్ 1986 పంజాబ్, హర్యానా, రాజస్తాన్
కావేరి జలాల వివాదాల ట్రిబ్యునల్ 1990 కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి
కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ 2004 మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
వంశధార జలాల వివాదాల ట్రిబ్యునల్ 2010 ఒడిశా, ఆంధ్రప్రదేశ్
మహదాయి జలాల వివాదాల ట్రిబ్యునల్ 2010 గోవా, కర్ణాటక, మహారాష్ట్ర
మహానది జలాల వివాదాల ట్రిబ్యునల్ 2018 ఒడిశా, ఛత్తీస్‌గఢ్