సూర్యపూర్​లో అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

 సూర్యపూర్​లో అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు
  • భారీగా తరలివచ్చిన మల్లయోధులు

కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని సూర్యపూర్​లో గురువారం నిర్వహించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఆద్యంతం అలరించాయి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన జాతర, కుస్తీ పోటీలకు జనం భారీగా తరలివచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన పేరుమోసిన మల్లయోధులు కుస్తీ పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు.

మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా డార్వ డేగ్రాన్ కు చెందిన యువతి దేవాని మణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పురుషుడితో తలపడి అతడిని చిత్తు చేసింది. ఫైనల్​లో గెలుపొందిన మహారాష్ట్ర నాందేడ్​కు చెందిన విజేత సాయినాథ్​కు రూ.6100 నగదు, వెండి కడియం బహూకరించారు.

ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, డీసీసీబీ, ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశ్, సాయి కిరణ్, జడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్ పోటీలను తిలకించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్లె మహేశ్, వీడీసీ అధ్యక్షుడు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.