చైతన్యపురిలో ఇంటర్ స్టూడెంట్​పై బ్లేడ్​తో దాడి..యాసిడ్ దాడికి ఇద్దరు దుండగుల యత్నం

చైతన్యపురిలో ఇంటర్ స్టూడెంట్​పై బ్లేడ్​తో దాడి..యాసిడ్ దాడికి ఇద్దరు దుండగుల యత్నం
  • యాసిడ్ దాడికి ఇద్దరు దుండగుల యత్నం
  • ప్రతిఘటించి పారిపోయిన బాలిక
  • చైతన్యపురిలో ఘటన

దిల్ సుఖ్ నగర్, వెలుగు : చైతన్యపురిలో ఇంటర్ స్టూడెంట్​పై ఇద్దరు దుండగులు బ్లేడ్​తో దాడి చేశారు. ఆమెపై యాసిడ్ దాడికీ ప్రయత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. చైతన్యపురి ప్రాంతానికి 17 ఏండ్ల బాలిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా, వాసవి కాలనీ రోడ్డు నెం.9లో ఇద్దరు దుండగులు ఆమెను అడ్డగించి బ్లేడ్​తో దాడి చేశారు. 

ఆగంతకుల చేతిలో యాసిడ్ బాటిల్ ఉండడంతో బాలిక వారిని ప్రతిఘటించి పారిపోయింది. ఈ ఘటనలో బాలిక రెండు చేతులపై గాయాలయ్యాయి. అక్కడ్నుంచి కాలేజీకి చేరుకున్న బాలిక వెంటనే తండ్రికి సమాచారం ఇవ్వగా, ఆయన చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. 

బాలికపై తెలిసిన వారే దాడి చేశారా? లేక స్నాచింగ్ చేసేందుకు దాడికి పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ జోన్ ఏడీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ కృష్ణయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.