పుట్టెడు దు:ఖంలోనూ పరీక్షకు.. ఇంటి దగ్గర డెడ్ బాడీ.. ఎగ్జామ్ రాసిన కూతురు

పుట్టెడు దు:ఖంలోనూ పరీక్షకు.. ఇంటి దగ్గర డెడ్ బాడీ.. ఎగ్జామ్ రాసిన కూతురు
  • రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రి  
  • సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో  ఘటన 

గజ్వేల్​(వర్గల్), వెలుగు: ఇంటి వద్ద తండ్రి డెడ్ బాడీ .. దు:ఖాన్ని దిగమింగుకుని మరోవైపు విద్యార్థిని ఇంటర్​ఎగ్జామ్ కు హాజరైంది. సిద్దిపేట జిల్లా వర్గల్​మండల కేంద్రానికి చెందిన పసుల లింగం(50) కారు డ్రైవర్. అతనికి భార్య యాదమ్మ, కూతురు తేజశ్రీ, కొడుకు సాయికుమార్​ఉన్నారు. మంగళవారం రాత్రి ఇన్నోవాలో తూప్రాన్ వెళ్లి తిరిగి వస్తుండగా నాచారం వద్ద గజ్వేల్ – -తూప్రాన్ రహదారిపై అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 

అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం కూతురు తేజశ్రీకి ఇంటర్​ఫస్టియర్​తొలి పరీక్ష ఉంది. ఇంట్లో తండ్రి డెడ్ బాడీ ఉండగా.. కూతురు బాధను దిగమింగుకుని పరీక్షకు హాజరైంది. పూర్తయిన తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది. ఘటన గ్రామస్తులను కూడా కంటనీరు పెట్టించింది.