నర్సంపేట, వెలుగు : ఆన్‌లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి తండ్రి మిట్టపల్లి సాయి తెలిపిన వివరాల ప్రకారం... నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డుకు చెందిన మిట్టపల్లి ప్రశాంత్ (17) ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
బుధవారం సాయంత్రం తన తండ్రి టైలర్ షాప్ వద్దకు అతను వెళ్లి వచ్చాడు. అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడు. ఇటీవలే తన కొడుకు ఆన్ లైన్ గేమ్ ఆడి రెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడని తండ్రి సాయి బోరున విలపించాడు. తన క్రెడిట్ కార్డుతో మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ ఆడాడని వాపోయాడు.