
కోరుట్ల, వెలుగు: పరీక్షలో ఫెయిల్ అవుతానన్న భయంతో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లికి చెందిన మోత్కూరి వెంకటేశం–- లత దంపతుల చిన్నకొడుకు సంజయ్ అలియాస్ బన్నీ (19) కల్లూరు మోడల్ స్కూల్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ (సీఈసీ) చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన విషయం ఇంట్లో చెప్పలేదు.
ఇటీవల నిర్వహించిన సెకండ్ ఇయర్ ప్రీఫైనల్ఎగ్జామ్లో మార్కులు తక్కువ రావడంతో ఫైనల్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతానేమోనని బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం తల్లి లత గుడికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.