ఫ్రెండ్‌‌ మరణం తట్టుకోలేక ఇంటర్‌‌ స్టూడెంట్‌‌ సూసైడ్‌‌

ఫ్రెండ్‌‌ మరణం తట్టుకోలేక ఇంటర్‌‌ స్టూడెంట్‌‌ సూసైడ్‌‌

గోదావరిఖని, వెలుగు : ఫ్రెండ్‌‌ మరణం తట్టుకోలేక ఓ ఇంటర్‌‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం జరిగింది. వన్‌‌టౌన్‌‌ ఎస్సై రమేశ్‌‌, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖనిలోని మార్కండేయకాలనీకి చెందిన ముక్కా రోహక్‌‌, మేదరి బస్తీకి చెందిన సుల్వ నందు (17) ఎన్టీపీసీలోని ఓ ప్రైవేట్‌‌ కాలేజీలో ఇంటర్‌‌ ఫస్ట్‌‌ ఇయర్‌‌ చదువుతున్నారు. రోహక్‌‌ గత నెల 30న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పటి నుంచి నందు మానసికంగా కుంగిపోయాడు. ఆదివారం రోహక్‌‌ ఇంట్లో నెల మాసికం పెట్టగా నందు హాజరయ్యాడు. తర్వాత ఇంటికి వచ్చిన అతడు రాత్రి అందరూ పడుకున్న తర్వాత వెనుక వైపున్న గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. అర్ధరాత్రి 2.30 గంటలకు నందు తండ్రి సమ్మయ్య నిద్ర లేచి కొడుకు ఉరివేసుకున్న విషయాన్ని గమనించాడు. వెంటనే గోదావరిఖని గవర్నమెంట్‌‌ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.