- కాలేజీ యాజమాన్యం ఒత్తిడే కారణమని ఆందోళన
- భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలంలో ఘటన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓ ఇంటర్ స్టూడెంట్‌ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కాలనీకి చెందిన వెంకటలక్ష్మణ్‌రావు, భారతీదేవి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉంది. కొడుకు రాంపవార్ (17)తో పాటు కూతురు లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు.
టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో స్టేట్ ర్యాంక్ సాధించిన రాంపవార్ ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతూనే ఐఐటీ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. మంచి ర్యాంక్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువ టైం ఇంట్లోనే ఉంటూ చదువుకునేవాడు. శనివారం రాత్రి ఒంటి గంట వరకు చదువుకున్న రాంపవార్, తెల్లారిన తర్వాత కుటుంబసభ్యులు చూసే సరికే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు.
కాలేజీ యాజమాన్యం ఒత్తిడే కారణమని..
కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే రాంపవార్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఒక్కో స్టూడెంట్‌ను ఒక్కో మాదిరిగా చూస్తోందని, రాంను తక్కువ చేసి మాట్లాడడం వల్లే సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు. అయితే రాంపవార్ చదువులో మెరిట్ స్టూడెంట్ అని, కాలేజీ సక్రమంగా రాకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామే తప్ప ఎలాంటి ఒత్తిడి చేయలేదని కాలేజ్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.