ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

  • లేట్​ అయిందని ఆందోళనతో ఎగ్జామ్​ సెంటర్​కు వెళ్లని విద్యార్థి
  • పరీక్ష రాయలేకపోయాననే బాధతో సాత్నాల ప్రాజెక్ట్​లో దూకి ఆత్మహత్య
  • ‘నాన్న .. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఘటన

జైనథ్, వెలుగు: ఎగ్జామ్ కు లేట్ అయిందని.. సెంటర్​కు వెళ్లినా ఒక నిమిషం నిబంధన కారణంగా లోపలికి అనుమతించరేమో అని మనస్తాపం చెంది ఇంటర్ సెకండియర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘నన్ను క్షమించు నాన్న.. ఎగ్జామ్ రాయలేకపోయానన్న బాధ ఊపిరి తీసుకోనివ్వడం లేదు..”అంటూ సూసైడ్ లెటర్ రాసి సాత్నాల ప్రాజెక్ట్​లో దూకాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

జైనథ్ మండలంలోని మాంగుర్ల గ్రామానికి చెందిన టేకం రాము, పంచపుల దంపతుల కొడుకు శివకుమార్ (17) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్​లో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. గురువారం ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్​లో శివకుమార్ కు సెంటర్ పడింది. పరీక్ష రాయడానికి ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి ఆటోలో బయల్దేరాడు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్​కు చేరుకునే సరికే తొమ్మిది అయింది. ఒక నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో.. తనను సెంటర్​లోకి సిబ్బంది అనుమతించరని భావించాడు. 

మొదటి రోజే ఎగ్జామ్ రాయలేకపోయానని బాధపడ్డాడు. మనస్తాపానికి గురైన శివకుమార్.. సెంటర్ కు వెళ్లకుండా నేరుగా సాత్నాల ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నాడు. లెటర్, పెన్ను, పర్సు, వాచీ ఒడ్డున పెట్టి ప్రాజెక్ట్​లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘నన్ను క్షమించు నాన్న.. నావల్ల కావట్లేదు ఈ బాధ భరించడం. మీరు నా కోసం చాలా చేశారు. కానీ, మీకోసం నేను ఏమీ చేయలేకపోతున్నా. నా జీవితంలో ఎప్పుడు ఇలా కాలేదు. మొదటిసారి పరీక్ష మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది. 

ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నా. నన్ను క్షమించు నాన్న”అంటూ శివ కుమార్ సూసైడ్ లెటర్​లో రాశాడు. లెటర్ చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో శివకుమార్ డెడ్​బాడీని పోలీసులు బయటికి తీయించారు. తమ కొడుకు ఉదయం 8 గంటలకే ఇంటి నుంచి ఆటోలో బయలుదేరాడని తల్లిదండ్రులు చెప్పారు. శివకుమార్ తొమ్మిది గంట లకు ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్​కు చేరుకున్నాడని ఎస్​ఐ పురుషోత్తం వివరించారు. అప్పటికే టైమ్ అయిపోవడంతో సెంటర్​కు వెళ్లకుండా ప్రాజెక్ట్​లో దూకి సూసైడ్ చేసుకున్నట్టు తెలిపారు.